ఎంపీగా ముద్రగడ పోటీ..?
ఒకసారి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి కూడా ముద్రగడ పోటీచేసి గెలిచారు. కాబట్టి ముద్రగడకు పై మూడు నియోజకవర్గాల్లో ఏదీ కొత్తకాదు.
ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం కుటుంబానికి రెండు సీట్లు కేటాయించటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారట. కాపు ఉద్యమనేతను కలిసి పార్టీలో చేరమని స్వయంగా పవన్ కల్యాణ్ ఆహ్వానించబోతున్నారు. ఈనెల 22 లేదా 23 తేదీల్లో ముద్రగడ జనసేనలో చేరబోతున్న విషయం తెలిసిందే. జనసేనలో చేరేముందే ముద్రగడ కుటుంబానికి కేటాయించబోయే సీట్లపై పవన్ పెద్దఎత్తున కసరత్తు చేసినట్లు తెలిసింది. పార్టీలోని సీనియర్లతో మంతనాలు జరిపిన తర్వాత ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ సీటును కేటాయించాలని నిర్ణయించారు.
కాకినాడ లోక్ సభ సీటుతో పాటు పిఠాపురం, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక సీటు కేటాయించబోతున్నారట. పై మూడుసీట్లలో ఎవరు ఎక్కడినుండి పోటీచేయాలనే విషయాన్ని ముద్రగడ కుటుంబానికే వదిలేయబోతున్నారు. జనసేన వర్గాల సమాచారం ప్రకారం కాకినాడ లోక్ సభ నుండి ముద్రగడ పద్మనాభం పోటీచేయాలని అనుకుంటున్నారట. అలాగే ప్రత్తిపాడు లేదా పిఠాపురం అసెంబ్లీ నుండి కొడుకు గిరిబాబు పోటీచేయవచ్చని అనుకుంటున్నారు. పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి గతంలో ముద్రగడ పోటీచేసి గెలుపోటములను చూశారు.
ఒకసారి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి కూడా ముద్రగడ పోటీచేసి గెలిచారు. కాబట్టి ముద్రగడకు పై మూడు నియోజకవర్గాల్లో ఏదీ కొత్తకాదు. కొడుకు మొదటిసారి పోటీచేయబోతున్నారు. తండ్రి ఎక్కువసార్లు గెలిచిన పిఠాపురం నుండే గిరిబాబు బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ముద్రగడకు జనాల్లో క్లీన్ ఇమేజి ఉన్న మాట వాస్తవమే కానీ, ఆర్థికంగా అంత గట్టి స్థితిలో లేరట. మరి ఏకకాలంలో ఒక పార్లమెంటు, మరో అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయాలంటే చాలా ఖర్చవుతుంది.
రెండు కూడా ఓపెన్ కేటగిరి సీట్లే కాబట్టి రెండింటిలో కలిపి తక్కువలో తక్కువ రు. 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మరంతటి భారీ ఖర్చును ముద్రగడ తట్టుకోగలరా అనే చర్చలు మొదలయ్యాయి. ప్రజాభిమానం ఉన్నప్పుడు డబ్బుతో పనుండదనే మాటలు వినటానికి మాత్రమే బాగుంటాయి కానీ, ఆచరణలో పనికిరావు. కారణాలు ఏవైనా గతంలో ముద్రగడ రెండుసార్లు ఓడిపోయిన విషయాన్ని మరచిపోకూడదు. కాబట్టి ఖర్చుల విషయంలో ముద్రగడ ఏమిచేస్తారో చూడాలి.