వైసీపీలోకి ముద్రగడ..? పావులు కదిపిన ఎంపీ మిథున్ రెడ్డి
కాకినాడలోని కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ ఇంటికి వెళ్లిన మిథున్ రెడ్డి చాలాసేపు అతనితో చర్చలు జరిపారు. అయితే ఈ క్రమంలో ముద్రగడ సానుకూలంగా స్పందించినా.. కాపు రిజర్వేషన్లకి సంబంధించి కొన్ని కండీషన్లని మిథున్‌రెడ్డి ముందు ఉంచినట్లు తెలుస్తోంది
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముంగిట అధికార వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలో ఊహించని స్థాయిలో మెజార్టీ సాధించిన వైసీపీ.. 2024 ఎన్నికల్లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ.. ఈసారి టీడీపీ- జనసేన కలిసి పోటీ చేయబోతుండటంతో గోదావరి జిల్లాల్లో వైసీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో గోదావరి జిల్లాలపై సీఎం వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరేలా వైసీపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.
వాస్తవానికి కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం గత కొన్నేళ్లుగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల తర్వాత కొన్నాళ్లపాటు యాక్టీవ్‌గా కనిపించారు. అప్పట్లో కాపులకి చంద్రబాబు ఇచ్చిన హామీలని నెరవేర్చాలంటూ ఛలో అమరావతి ఉద్యమానికి పిలుపునిచ్చారు. కానీ ఈ క్రమంలో ముద్రగడకి చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
చంద్రబాబు ఆదేశాల మేరకు అతడ్ని పోలీసులు చాలా సందర్భాల్లో గృహ నిర్బంధం చేశారు. మధ్యలో తునిలో ఓ బహిరంగ సభని ఏర్పాటు చేసినా అది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ కాలేదు. దాంతో చంద్రబాబుని టార్గెట్‌గా చేసుకుని బహిరంగ లేఖలు రాశారు. కానీ వాటిని మాజీ సీఎం పట్టించుకోలేదు. దాంతో ముద్రగడ రాజకీయాలకి దూరంగా ఉండిపోయి.. పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
2019లో వైపీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ విషయంలో కాస్త ఉదాసీనతతో వ్యవహరిస్తోంది. తుని రైలు దగ్ధం కేసుల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అతనిపై పెట్టిన కేసుల్ని కూడా ఉపసహరించుకుంది. దాంతో కొన్నాళ్లు రిలాక్స్‌గా ఉండిపోయిన ముద్రగడ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో వైసీపీ తరఫున అతనికి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రూపంలో ఆహ్వానం వెళ్లింది.
కాకినాడలోని కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ ఇంటికి వెళ్లిన మిథున్ రెడ్డి చాలాసేపు అతనితో చర్చలు జరిపారు. అయితే ఈ క్రమంలో ముద్రగడ సానుకూలంగా స్పందించినా.. కాపు రిజర్వేషన్లకి సంబంధించి కొన్ని కండీషన్లని మిథున్‌రెడ్డి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దాంతో సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడి ఏ విషయం తెలియజేస్తానని మిథున్ రెడ్డి తిరిగి వచ్చేశారట. ఓవరాల్‌గా ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ కోర్టులో బంతి ఉంది. ఏపీలో అధికారం దక్కాలంటే సెంటిమెంట్‌గా గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ గెలవాల్సి ఉంటుంది. కాబట్టి.. జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీలో ముద్రగడ చేరితే.. అది టీడీపీ- జనసేనకి రాబోవు ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ అవడం మాత్రం ఖాయం!