పవన్ కల్యాణ్ ఆ భాషేంటి? - ముద్రగడ ఫైర్
175 స్థానాల్లో పోటీ చేసినప్పుడు మాత్రమే నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడగాలి గానీ.. పొత్తులతో పోటీ చేస్తున్నప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. పవన్‌కు ఒక ఘాటు లేఖ రాశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ముద్రగడ ఖండించారు. గతంలో కాపు ఉద్యమానికి వాహనాలను పంపించడంతో పాటు ఆర్థిక సాయం కూడా చేసిన కుటుంబాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసమని పవన్‌ను ముద్రగడ ప్రశ్నించారు.
రాజకీయ సలహాలు ఎవరిస్తున్నారో గానీ.. అసలు మీరు వాడుతున్నభాష ఒక పార్టీ అధ్యక్షుడి స్థాయికి తగినట్టు లేదని ముద్రగడ విమర్శించారు. పదేపదే తొక్క తీస్తా, నారా తీస్తా, చెప్పుతో కొడుతా అంటున్నారు కదా.. ఇప్పటి వరకు ఎంతమందికి అలా చేశారో చెప్పాలన్నారు. పార్టీ పెట్టిన తర్వాత పది మంది చేత ప్రేమించబడాలి గానీ, వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయం అని నిలదీశారు.
విలువైన సమయాన్ని తిట్లకోసం కాకుండా ప్రత్యేకహోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి వాటిని సాధించేందుకు ఉపయోగించాలని సలహా ఇచ్చారు. తానేమీ ఇరువురు పెద్దల వద్ద డబ్బులు తీసుకోలేదంటూ ముద్రగడ ఒక వ్యాఖ్య చేశారు. కాకినాడ ఎమ్మెల్యే దొంగ అయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారో ఆలోచించరా అని పవన్‌ను ప్రశ్నించారు. ఒకవేళ అతడు అలాంటి వ్యక్తే అయితే ఎన్నికల్లో ద్వారంపూడి మీద పోటీ చేసి ఓడించాలని ముద్రగడ సలహా ఇచ్చారు.
ఒకవైపు బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తామంటూనే నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ప్రజలను ఎలా కోరుతున్నారని నిలదీశారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడు మాత్రమే నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడగాలి గానీ.. పొత్తులతో పోటీ చేస్తున్నప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.