Telugu Global
Andhra Pradesh

బీజేపీపై కాపుల కన్నెర్ర.. - ఒక్క సీటూ కేటాయించకపోవడంపై ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కలిసి కాపులకు కావాలనే అన్యాయం చేశారంటూ కాపు ఐక్య వేదిక మండిపడుతోంది.

బీజేపీపై కాపుల కన్నెర్ర.. - ఒక్క సీటూ కేటాయించకపోవడంపై ఆగ్రహం
X

భారతీయ జనతా పార్టీపై ఆంధ్రప్రదేశ్‌లోని కాపు ఐక్య వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 16 స్థానాల్లోనూ ఒక్కరికి కూడా కాపులకు సీటు కేటాయించలేదు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కాపు ఉప కులాలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని కాపు ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

రాష్ట్రంలో తమను పూర్తిగా విస్మరించిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పితీరుతామని కాపు ఐక్యవేదిక స్పష్టం చేసింది. అంతేకాదు.. బీజేపీకి తగిన బుద్ధిచెబుదామంటూ రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కాపు ఉప కులాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కలిసి కాపులకు కావాలనే అన్యాయం చేశారంటూ కాపు ఐక్య వేదిక మండిపడుతోంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు ఐక్యవేదిక గురువారం బహిరంగ లేఖను విడుదల చేసింది.

First Published:  29 March 2024 9:24 AM IST
Next Story