వెల్లువలా తరలివస్తున్న కన్నడ భక్తులు.. శ్రీశైలంలో ఉగాది రద్దీ షురూ
కర్ణాటకలోని శైవభక్తులు భ్రమరాంబికా దేవిని ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ఉగాది ఉత్సవాల్లో ఆడపడుచును చూడాలని వేల మంది భక్తులు నల్లమల అడవుల నుంచి కాలినడకన శ్రీశైలానికి రావడం ఆనవాయితీ.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈనెల 6 నుంచి 10 వరకు ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం దేవస్థానం చలువ పందిళ్ల నుంచి క్యూలైన్ల వరకు అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఉగాది ఉత్సవాల కోసం కర్నాటక నుంచి భక్తులు తరలివస్తుండడంతో శ్రీశైలంలో రద్దీ అనూహ్యంగా పెరిగింది.
దర్శనానికి 5 గంటలు
కర్ణాటకలోని శైవభక్తులు భ్రమరాంబికా దేవిని ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ఉగాది ఉత్సవాల్లో ఆడపడుచును చూడాలని వేల మంది భక్తులు నల్లమల అడవుల నుంచి కాలినడకన శ్రీశైలానికి రావడం ఆనవాయితీ. అందుకే మండుటెండలోనూ వేల మంది భక్తులు పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. దీంతో రద్దీ పెరిగి దర్శనానికి 5 గంటల వరకు సమయం పడుతోంది.
రాబోయే వారం రోజులు రద్దీ మరింతగా
ఇప్పటికే దర్శనానికి 5 గంటల వరకు సమయం పడుతుండగా వారాంతం నుంచి ఈ రద్దీ మరింత పెరగనుంది. క్రోధి నామ ఉగాది ఉత్సవాలు ఈనెల 6 అంటే శనివారం నుంచి ప్రారంభమై 10వ తేదీ వరకు జరుగుతాయి. ఓపక్క ఉత్సవాలు, మరోపక్క వారాంతపు సెలవులు, 9వ తేదీన ఉగాది పర్వదినం ఇవన్నీ కలిసి రద్దీ విపరీతంగా ఉండబోతోందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.