ముఖ్య అనుచరులతో ఈ రోజు 'కన్నా' భేటీ....పార్టీ మార్పు తథ్యం?
కొంత కాలంగా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పుపై ఊహాగానాలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశంలో చేరతారని కొన్ని రోజులు, జనసేన లో చేరతారని మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు, కన్నాకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కన్నా బహిరంగంగానే వీర్రాజు మీద విమర్శలు చేశారు. దాంతో బీజేపీ అధిష్టానం స్పందించి కన్నా తో చర్చలు కూడా జరిపింది. అయినప్పటికీ కన్నా ఆ పార్టీలో టచ్ మీ నాట్ గానే ఉంటున్నారు. సోమవారం అమరావతిలో జరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో సైతం ఆయన పాల్గొనలేదు.
మరో వైపు కొంత కాలంగా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పుపై ఊహాగానాలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశంలో చేరతారని కొన్ని రోజులు, జనసేన లో చేరతారని మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. కొన్ని రోజుల క్రితం జనసేన నేత నాదెండ్ల మనోహర్ కన్నా తో సమావేశమవడం కలకలం సృష్టించింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణ తన ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన నివాసంలో మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కన్నా పార్టీ మార్పుపై తన అనుచరుల అభిప్రాయాలను తెలుసుకుంటారని ప్రచారం సాగుతోంది. ఏ పార్టీలో చేరాలన్నది కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఏదేమైనా ఈ రోజటి సమావేశం కన్నా లక్ష్మీనారాయణ భవిష్యత్తుపై ఒక స్పష్టతనిస్తుందని భావిస్తున్నారు.