ఏపీ బీజేపీలో వివాదాల కుంపట్లు.. - కన్నా కామెంట్లతో రచ్చరచ్చ
గతంలో బీజేపీలోకి ఎంతోమందిని తాను తీసుకొచ్చానని, ఇప్పుడు వారంతా ఎందుకు బయటకు వెళుతున్నారో సోము వీర్రాజే సమాధానం చెప్పాలని కన్నా సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఏపీ బీజేపీలో వివాదాల కుంపట్లు రగులుతున్నాయి. స్వపక్షంలోనే విపక్షాలు పబ్లిగ్గా ఫైట్‌కి దిగుతున్నాయి. పార్టీ పరువును బజారున పడేస్తున్నాయి. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆయన కస్సుబుస్సులాడారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పు చేపట్టారు. ఈ వ్యవహారం, తాజా నిర్ణయాలు కన్నాకు రుచించలేదు. గతంలో ఆయా స్థానాల్లో ఉన్నవారంతా కన్నా ఆశీస్సులతో పదవులు పొందినవారే కావడమే దీనికి ప్రధాన కారణం. గతంలో తాను నియమించినవారినే టార్గెట్ చేసి ఇప్పుడు మార్పులు చేశారనేది ఆయన కోపానికి కారణంగా కనబడుతోంది. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను ఎలా మారుస్తారంటూ ఆయన ఫైర్ అయ్యారు. అధ్యక్షుల మార్పు విషయంలో తనను సంప్రదించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. అయితే తనకు చెప్పలేదన్న దానికంటే తన వారిని పక్కన పెట్టేశారనేది కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గతంలో బీజేపీలోకి ఎంతోమందిని తాను తీసుకొచ్చానని, ఇప్పుడు వారంతా ఎందుకు బయటకు వెళుతున్నారో సోము వీర్రాజే సమాధానం చెప్పాలని కన్నా సూటిగా ప్రశ్నిస్తున్నారు. సోము వీర్రాజు వియ్యంకుడు బీఆర్ఎస్‌లో చేరడంపై కూడా నిలదీస్తున్నారు. తెలంగాణలో బీజేపీని వీక్ చేసేందుకు సోము వీర్రాజు కేసీఆర్‌తో చేతులు కలిపారన్నది కన్నా ఆరోపణ కావడం గమనార్హం.
మరోపక్క కన్నాపైనా ఆయన వ్యతిరేక వర్గం విమర్శలు గుప్పిస్తోంది. కన్నాకు స్వపక్షం బీజేపీ కన్నా మిత్రపక్షం జనసేన పైనే ప్రేమ ఎక్కువని ఆరోపిస్తోంది. పవన్‌ను బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని కూడా ఆయన ప్రకటన చేయడాన్నిఈ సందర్భంగా ప్రస్తావిస్తోంది. జనసేన బలంగా ఉంటే.. తాను అటువైపు జంప్ చేయాలనేది కన్నా ఉద్దేశంగా ఆయన వ్యతిరేక వర్గం వాదన. పవన్ కల్యాణ్‌కు అండగా ఉంటానని ఇటీవల ఆయన ప్రకటించడం కూడా వారి వాదనలకు బలం చేకూరుస్తోంది.
ఇటీవల నాదెండ్లతో కన్నా భేటీ జరిగింది. ఆ భేటీ గంటకు పైగా కొనసాగింది. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు గానీ.. బయటికి మాత్రం ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏమాత్రం లేదని చెప్పడం గమనార్హం. రాజకీయ ప్రాధాన్యం లేదంటే ఉందనేది రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై ఉన్న అభిప్రాయం కావడం గమనార్హం. సోము వీర్రాజు మాత్రం కన్నా వ్యాఖ్యలపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.