Telugu Global
Andhra Pradesh

అధిష్టానాన్ని 'కన్నా' బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

పార్టీ అధిష్టానం మీద కన్నా అసంతృప్తిగా ఉన్నారని తొందరలోనే టీడీపీలో చేరే అవకాశాలున్నాయని ఆమధ్య ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఈ మాజీ అధ్యక్షుడు ఖండించలేదు. అలాంటిది ఇప్పుడు నాదెండ్లతో భేటీ అవగానే కన్నా జనసేనలో చేరబోతున్నారా? అనే ప్రచారం మొదలైపోయింది.

అధిష్టానాన్ని కన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?
X

బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మిత్రపక్షం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌తో భేటీ కారణంగా కన్నా వార్తల్లో వ్యక్తయ్యారు. మామూలుగా అయితే బీజేపీ, జనసేన మిత్రపక్షాలే కాబట్టి రెండు పార్టీల నేతలు భేటీ అవటంలో విశేషం ఉండదు. కానీ ఇక్కడ భేటీ అయ్యింది కన్నా కాబట్టే బాగా హైలైట్ అయ్యింది. కొంతకాలంగా కన్నా పార్టీలో స్తబ్దుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

పార్టీ అధిష్టానం మీద కన్నా అసంతృప్తిగా ఉన్నారని తొందరలోనే టీడీపీలో చేరే అవకాశాలున్నాయని ఆమధ్య ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఈ మాజీ అధ్యక్షుడు ఖండించలేదు. అలాంటిది ఇప్పుడు నాదెండ్లతో భేటీ అవగానే కన్నా జనసేనలో చేరబోతున్నారా? అనే ప్రచారం మొదలైపోయింది. ఎందుకంటే వీళ్ళ భేటీ జరుగుతున్నంతసేపు ఇంటి బయట మద్దతుదారులు కన్నా జనసేనలో చేరబోతున్నారన్నట్లుగా జిందాబాద్‌లు కొట్టారు.

దాంతో బీజేపీలో కంగారు పెరిగిపోయింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే అధిష్టానాన్ని ఒత్తిడిలోకి నెట్టి తనకు కావాల్సిన వ్యవహారాలను చక్కబెట్టుకోవటం కన్నాకు అలవాటే. 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరే సమయంలో కూడా కన్నా వైసీపీని పావుగా వాడుకున్నారు. బీజేపీ అధిష్టానం కన్నాను పార్టీలో చేరమంటే కన్నాయేమో తాను వైసీపీలో చేరబోతున్నట్లు సంకేతాలిచ్చారు. దాంతో అధిష్టానం మాట్లాడి కన్నాను బీజేపీలోకి చేర్చుకుని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

తర్వాత అధ్యక్షుడిగా కన్నాను పక్కన పెట్టి సోమువీర్రాజును నియమించారు. మళ్ళీ రెండోసారి అధ్యక్షుడవ్వాలని కన్నా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ప్రయత్నాలు పెద్దగా ఫలించటం లేదని సమాచారం. ఇందులో భాగంగానే ఈమధ్య వీర్రాజు నాయకత్వంపై కన్నా బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసి కలకలం సృష్టించారు. అప్పటి నుండే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది హఠాత్తుగా మనోహర్‌తో భేటీ సందర్భంగా కన్నా జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఎన్నికలకు ముందు రెండోసారి అధ్యక్ష పదవి కోసం అధిష్టానాన్ని కన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే టాక్ కూడా పార్టీలో నడుస్తోంది. మరి కన్నా ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

First Published:  15 Dec 2022 11:57 AM IST
Next Story