Telugu Global
Andhra Pradesh

గోరంట్ల మాధవ్‌పై కమ్మ సంఘం ఫైర్

వైసీపీలో ఉన్న అంతర్గత విబేధాల కారణంగానే ఆ వీడియో బయటకు వచ్చినట్టు తమకు సమాచారం ఉందన్నారు కమ్మ సంఘం నేతలు.

గోరంట్ల మాధవ్‌పై కమ్మ సంఘం ఫైర్
X

తన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్..''కమ్మ నాకొడుకులు'' అంటూ మాట్లాడడంపై కమ్మ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వస్తే అందులో కమ్మవారికి ఏం సంబంధం అని వారు ప్రశ్నించారు. వైసీపీలో ఉన్న అంతర్గత విబేధాల కారణంగానే ఆ వీడియో బయటకు వచ్చినట్టు తమకు సమాచారం ఉందన్నారు.

వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి, ఏపీ కాకతీయ సేవా సమాఖ్య

మాధవ్ చేసిన వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ పార్టీలు, నేతల మధ్య వివాదాలుంటే వారు వారు చూసుకోవాలి కానీ కమ్మ నాకొడుకులు అంటూ మాట్లాడడం ఏమిటి?. పోలీసు శాఖలో ఉన్నప్పుడు కూడా క్రిమినల్ కేసులు, హత్య కేసులున్న వ్యక్తి ఇప్పుడు ఎంపీ అయి ఇలా మాట్లాడడం ఏమిటి?. తన బట్టలను తాను విప్పేసుకుని నీచంగా ప్ర‌వ‌ర్తించిన వ్యవహారంలో కమ్మ వారికి ఏం సంబంధం?.

ప్రతి విషయానికి కులానికి ఆపాదించడం ఏపీలో అలవాటుగా మారింది. కమ్మ సామాజికవర్గం చేసిన తప్పేంటి?. మా సంఘం తరఫున అన్ని కులాల్లోని పేదలకు స్కాలర్‌ షిప్‌లు ఇస్తున్నాం. కమ్మ కులాన్ని దూషించిన గోరంట్ల మాధవ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎంపీగా ఉంటూ ఏపీ పరువు తీసిందే కాక.. మీడియా సమావేశంలో బూతులు మాట్లాడడం ఏమిటి?. గోరంట్ల మాధవ్ తక్షణం క్షమాపణ చెప్పకపోతే మేమంతా ఒక బృందంగా ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఆయనపై దర్యాప్తు చేయించాల్సిందిగా కోరుతాం.

కనకమేడల శ్రీనివాస్ చక్రవర్తి, కమ్మ సంఘం నేత

ఎంపీ అయి ఉండి సిగ్గు విడిచి ఒక కులాన్ని తిట్టడం ఎంత వరకు సమంజసం?. ఇది వరకు కూడా మా కులంపై కొందరు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు వారి విచక్షణకే వదిలేశాం.. కానీ ఈ మధ్య ఈ తరహా దాడి మరీ తీవ్రతరమైంది. ఇకపై ఉపేక్షించబోము. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. ఒక వ్యక్తి తప్పు చేసి కులాన్ని అడ్డుపెట్టుకుంటే అప్పుడు ఆ కులంలోని వారు వెనుకేసుకొస్తే కుల ప్రతిష్టే దెబ్బతింటుంది. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు విచక్షణ, జ్ఞానం అన్నది ఉండాలి.

వెలగపూడి గోపాలకృష్ణప్రసాద్, కమ్మ సంఘం నాయకుడు

ముఖ్యమంత్రే స్వయంగా కులం పేరు ఎత్తి మాట్లాడినప్పుడే మేము స్పందించి ఉండాల్సింది. కానీ తెలుసుకుని తండ్రి బాటలో నడుస్తాడులే అని సర్దుకుపోయాం. ఇకపై కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని భావిస్తే తాటతీస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో కమ్మవారు ఉండకూడదని, తామంతా రాష్ట్రం వీడి వెళ్లాలన్నది మీ భావన అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పండి. కమ్మ కులానికి చెందిన వారు ఎవరైనా సరే ఇతర కులస్తులను తిట్టినా మేం చర్యలు తీసుకుంటాం. అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న కులాన్ని శాశ్వతంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఈ తరహా దాడులు చేస్తున్నారు.

First Published:  6 Aug 2022 4:31 PM IST
Next Story