Telugu Global
Andhra Pradesh

పవన్‌కు కాకినాడ వైసీపీ కాపు నేతల వార్నింగ్

పవన్‌ కల్యాణ్‌కు ద్వారంపూడి ఫోబియా ప‌ట్టుకుందన్నారు. అందుకే ప్రతి మీటింగ్‌లోనూ ద్వారంపూడి గురించి మాట్లాడుతున్నాడ‌ని విమర్శించారు. మాటకు ముందు చెప్పు తీస్తా, తోలు తీస్తా అంటే ఇవతలి వ్యక్తులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

పవన్‌కు కాకినాడ వైసీపీ కాపు నేతల వార్నింగ్
X

వారాహి యాత్రలో పదేపదే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్‌ కల్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా కాకినాడ వైసీపీ కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు మీడియా ముందుకు వచ్చారు. వారితో పాటు మీడియా ముందుకు వచ్చిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. పవన్ కల్యాణ్ పదేపదే తన గురించి మాట్లాడుతున్నారని.. సోమవారం ఉదయం ప్రెస్‌మీట్‌ పెట్టి పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతానన్నారు.

తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే వ్యక్తిని కాదన్నారు. కాకినాడలో పుట్టి పెరిగిన వ్యక్తినని.. తాను కాకినాడలో ఉగాది పచ్చడి లాగా అన్ని రుచులు చూసిన వ్యక్తినన్నారు. తానేమీ అన్న పేరు చెప్పుకునే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదని ప‌వ‌న్‌కు చుర‌క‌లంటించారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ కాపు నేతలు.. పవన్‌ కల్యాణ్‌కు ద్వారంపూడి ఫోబియా ప‌ట్టుకుందన్నారు. అందుకే ప్రతి మీటింగ్‌లోనూ ద్వారంపూడి గురించి మాట్లాడుతున్నాడ‌ని విమర్శించారు. మాటకు ముందు చెప్పు తీస్తా, తోలు తీస్తా అంటే ఇవతలి వ్యక్తులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. వైసీపీలో కాపులైన తమకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నా.. కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం పవన్‌ కల్యాణ్ చేస్తున్నారని విమర్శించారు.

కాపు నాయకులమైన తాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారని పలకరించిన వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమేనని ఒక కాపు నాయకుడు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇక్కడున్న కాపులను ఎలా కలుపుకుని వెళ్లాలో చంద్రశేఖర్ రెడ్డికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదన్నారు. ఆయన ఎప్పుడూ కులంతో రాజకీయం చేసే వ్యక్తి కాదన్నారు. పవన్‌ కల్యాణ్ వచ్చి ఇక్కడ కుల గొడవలు సృష్టించవద్దన్నారు. పవన్ కల్యాణ్‌కు ఇలాంటి వెధవ బుద్ది ఎలా పుట్టిందో అర్థం కావడం లేదన్నారు.

జనసేన మహిళా కార్యకర్తలను కొట్టామని పవన్‌ కల్యాణ్ మాట్లాడుతున్నారు.. కానీ ఆ రోజు ద్వారంపూడి ఇంటి మీదకు వారే వచ్చి దాడి చేశారన్నారు. వారి నుంచి రక్షించుకునేందుకు మాత్రమే తాము ప్రతిఘటించామన్నారు. ఆరోజు ఆ మహిళలు ఎలాంటి మాటలు మాట్లాడారో తెలుసుకోవాలన్నారు. కాకినాడలో రంగా మీటింగ్ పెట్టినప్పటి నుంచీ తాము ద్వారంపూడి కుటుంబంతోనే ఉన్నామని మరో కాపు నాయకుడు వివరించారు. పవన్‌ కల్యాణ్ తన తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

First Published:  18 Jun 2023 12:36 PM IST
Next Story