Telugu Global
Andhra Pradesh

8 మంది చావుకి కారణమైన చంద్రబాబుపై కేసు పెట్టాలి –మంత్రి కాకాణి

8మంది చావుకి చంద్రబాబే కారణం అన్నారు కాకాణి. ఆ 8మంది కుటుంబాల ఘోష చంద్రబాబుకి, టీడీపీకి కచ్చితంగా తగులుతుందన్నారు.

8 మంది చావుకి కారణమైన చంద్రబాబుపై కేసు పెట్టాలి –మంత్రి కాకాణి
X

8 మంది చావుకి కారణమైన చంద్రబాబుపై కేసు పెట్టాలి –మంత్రి కాకాణి

చంద్రబాబు ప్రచార ఆర్భాటం, అధికార దాహం కోసం 8మందిని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని, ఆయనపై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు.

చంద్రబాబుకి శవ రాజకీయాలు చేయడం అలవాటేనని, కానీ ఇక్కడ ఏకంగా 8మందిని ఆయన శవాలుగా మార్చేశారని మండిపడ్డారు. గతంలో గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట, ఇప్పుడు కందుకూరులో జరిగిన తొక్కిసలాట మధ్య పోలిక ఉందన్నారు.

అప్పట్లో చంద్రబాబు పుష్కర స్నానం కోసం, ఆయన ఫొటో షూట్ కోసం ప్రజల్ని బలవంతంగా ఆపి తొక్కిసలాటకు కారణం అయ్యారని, ఇప్పుడు కూడా ఇరుకు సందుల్లో జనాల్ని పోగు చేసి, ఫొటోలకు ఫోజులిస్తూ, డ్రోన్ కెమెరాల్లో ఎక్కువమంది కనపడే ప్రయత్నం చేస్తూ 8మంది మృతికి కారణం అయ్యారని ఆరోపించారు.

పోలీసుల తప్పేముంది..

కందుకూరులో జరిగిన దుర్ఘటనకు పోలీసు బందోబస్తు సరిగా లేకపోవడం కారణం అంటూ వస్తున్న వార్తల్ని మంత్రి కాకాణి ఖండించారు. టీడీపీ సభలకు వస్తున్న పోలీసుల్ని, ఆ పార్టీ నాయకులు కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇప్పుడు పోలీసులు లేరంటూ వారిపైనే నిందలు వేయాలనుకోవడం దారుణం అని అన్నారు.

8మంది చావుకి చంద్రబాబే కారణం అన్నారు. ఆ 8మంది కుటుంబాల ఘోష చంద్రబాబుకి, టీడీపీకి కచ్చితంగా తగులుతుందన్నారు. తన కుటుంబం మాత్రం బాగుంటే చాలు, పక్కన వాళ్లు ఏమైపోయినా పర్లేదు అనుకునే రకం చంద్రబాబు అని మండిపడ్డారు కాకాణి.

ఇదేం ఖర్మ రాష్ట్రానికి..

చంద్రబాబు పుట్టడమే ఏపీకి పెద్ద ఖర్మ అని, ఇప్పుడు కందుకూరుకి రావడంతో అక్కడి ప్రజలకు ఖర్మ పట్టించారని అన్నారు కాకాణి. గతంలో కందుకూరులో తాము కూడా బహిరంగ సభ పెట్టామని, వైసీపీ సభల్లో ఎక్కడా ఎప్పుడూ చిన్న అపశృతి కూడా దొర్లలేదని గుర్తు చేశారు కాకాణి. కేవలం చంద్రబాబు ప్రచార యావతోనే జనాల్ని ఇరుకు సందుల్లోకి తీసుకొచ్చి, తొక్కిసలాటకు కారణం అయ్యారన్నారు.

నెల్లూరు జిల్లాలోకి వచ్చిన చంద్రబాబు ఇక్కడి ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా, ఇప్పుడు మరోసారి తనకు అధికారం ఇవ్వాలన ప్రాధేయపడటం చంద్రబాబు దివాళాకోరు తనానికి నిదర్శనం అన్నారు.

First Published:  29 Dec 2022 11:43 AM IST
Next Story