ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రెండున్నరేళ్లుగా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన అభియోగాలను తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.
సీబీఐ నోటీసులపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత హఠాత్తుగా నోటీసులు ఇచ్చి వెంటనే విచారణకు రావాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఒక రోజు ముందు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలంటే ఎలా సాధ్యమవుతుందన్నారు. తనకు నాలుగు రోజుల పాటు బిజీ షెడ్యూల్ ఉందని, అందుకే సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు గడువు కోరినట్టు చెప్పారు. సీబీఐ మరోసారి నోటీసులు ఇస్తుందని అప్పుడు వెళ్లి.. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ చెప్పారు.
రెండున్నరేళ్లుగా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన అభియోగాలను తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. తానేంటో ప్రజలకు బాగా తెలుసన్నారు. న్యాయం గెలిచి, నిజం బయటకు రావాలన్నదే తన కోరికన్నారు.
నిజం బయట పడాలని ఆ భగవంతుడిని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారు మరోసారి పునరాలోచన చేసుకోవాలన్నారు. ఇలాంటి ఆరోపణలు మీ మీద కూడా వస్తే మీ కుటుంబ సభ్యులు ఎలా బాధపడుతారో ఒకసారి ఊహించుకోవాలన్నారు.
మీ కుటుంబాల్లోనూ ఇలాంటి పరిస్థితులు వస్తే జీర్ణించుకోగలరా అని తనపై ఆరోపణలను చేస్తున్న వారిని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. అటు సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల వెళ్లారు.