నన్ను వాడేస్తున్నారు..! - ఫొటో మార్ఫింగ్‌పై కేఏ పాల్ సీరియస్
ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్న ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ, జనసేన పార్టీల రాజకీయ పొత్తుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
తనను అడ్డగోలుగా వాడేస్తున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడుతున్నారు. తన ఫొటోను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. అంతేకాదు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్‌కు దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఇంతకీ ఆయన చెప్పేదేమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అవినీతి చక్రవరి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, సినీ నటుడు పవన్ కల్యాణ్ మధ్య తన ఫొటోను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకుంటున్నారని చెబుతున్నారు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫొటోను వైరల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన ఫిర్యాదులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల ఆంధ్రా పాలిటిక్స్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో 62 శాతం మంది ప్రజాశాంతి పార్టీకి మద్దతు పలకడం పట్ల లోకేష్, పవన్ ఆందోళన చెందుతున్నారని కేఏ పాల్ ఈ సందర్భంగా చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్, పవన్ పొత్తుల వ్యవహారంలో తన ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తన ప్రతిష్టకు భంగం కలిగించడమేనని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్న ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ, జనసేన పార్టీల రాజకీయ పొత్తుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తన మిలియన్ల భక్తులు, పవన్ ఫ్యాన్స్ కూడా వీరి ఒప్పందాలను అంగీకరించే పరిస్థితి లేదని పాల్ చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీల పొత్తును 27 శాతం మంది కాపు సామాజికవర్గం వారు వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాదు తన ఫిర్యాదును కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కూడా పంపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అదండీ సంగతి!