డిసెంబర్ 28 డెడ్‌లైన్.. ఆపై ఆమరణ దీక్ష- కేఏ పాల్
తనపై కేసులను ఏపీ, తెలంగాణ హైకోర్టులు కొట్టివేసినప్పటికీ విశాఖ కోర్టు మాత్రం కొట్టివేయడం లేదన్నారు. పదే పదే వాయిదా వేస్తున్నారని.. ఇప్పటి వరకు 700 సార్లు ఇలా వాయిదా వేశారన్నారు.
తనపై దాఖలైన కేసుల్లో విచారణ త్వరగా ముగియకపోవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. తనను ప్రధానిని చేస్తే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి న్యాయ వ్యవస్థలో అవినీతి లేకుండా చేస్తానని ప్రకటించారు.
గతంలో కేఏ పాల్‌పై ఆయన మేనల్లుడు, సోదరుడి భార్య కేసు పెట్టారు. ఈ కేసు విషయంలో విశాఖ కోర్టుకు పాల్ హాజరయ్యారు. తన సంస్థపై 2007లోనే కేసు పెట్టారని.. దాన్ని కోర్టు కొట్టివేసిందని, తిరిగి 2009లోనూ కేసు పెట్టారని దాన్ని కూడా హైకోర్టు కొట్టివేసిందని.. మరోసారి అదే ఆరోపణలతో కేసు పెట్టారని పాల్ ఆరోపించారు.
తనపై కేసులను ఏపీ, తెలంగాణ హైకోర్టులు కొట్టివేసినప్పటికీ విశాఖ కోర్టు మాత్రం కొట్టివేయడం లేదన్నారు. పదే పదే వాయిదా వేస్తున్నారని.. ఇప్పటి వరకు 700 సార్లు ఇలా వాయిదా వేశారన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో న్యాయమూర్తితో తాను నేరుగా మాట్లాడబోతున్నట్టు చెప్పారు. తనపై దాఖలైన తప్పుడు కేసులను వాయిస్తున్న న్యాయవాదులను బార్ కౌన్సిల్ నుంచి బహిష్కరించాలన్నారు.
డిసెంబర్ 28 వరకు తాను గడువు ఇస్తున్నానని ఆలోపు తనకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని కేఏ పాల్ ప్రకటించారు. ఈ కేసులో తాను 16ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని.. అయినా న్యాయం జరగడం లేదన్నారు. తన సంస్థలపై కేసుల కారణంగా పిల్లలు, అనాథలకు సాయం అందించలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం తనను ప్రధానిని చేయడం ఒక్కటేనన్నారు.