రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవే నయం.. కేఏ పాల్ విసుర్లు
మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా సెంట్రల్ మినిస్టర్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారని కేఏ పాల్ గుర్తు చేశారు. కానీ.. పవన్ కళ్యాణ్ అలా కాదని.. ఆయనకి అసలు నిలకడే లేదని దుయ్యబట్టారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన చూసిన తర్వాత అందరూ షాక్ అయి ఉండొచ్చని.. కానీ తాను మాత్రం షాక్‌కి గురి కాలేదంటూ పాల్ చెప్పుకొచ్చారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేస్తున్నాయని మండిపడిన కేఎల్ పాల్.. ఏపీకి ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ ఇవ్వకుండా బీజేపీ తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. అలానే రూ.4 లక్షల కోట్ల విలువ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేవలం రూ.4 వేల కోట్లకి ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తుంటే తాను ఆపానని చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా వైఎస్ జగన్‌ని ఓడించటానికి పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవన్నీ బీజేపీ- బి పార్టీలే అంటూ కేఏ పాల్ ఎద్దేవా చేశారు.
మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా సెంట్రల్ మినిస్టర్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారని కేఏ పాల్ గుర్తు చేశారు. కానీ.. పవన్ కళ్యాణ్ అలా కాదని.. ఆయనకి అసలు నిలకడే లేదని దుయ్యబట్టారు. 2014లో టీడీపీ- బీజేపీలకి మద్దతు ఇచ్చి ఎన్నికల్లో అతను పోటీ చేయలేదని.. ఆ తర్వాత 2019లో వాటిని వ్యతిరేకించి సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్నాడన్నారు. కానీ పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారని గుర్తు చేశారు. ఓవరాల్‌గా ఇప్పుడు మళ్లీ టీడీపీతో, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళతామని చెప్పడం దశావతారాలు కాకపోతే మరి ఏమిటని ప్రశ్నించారు.