ఏపీ ప్రభుత్వ నాడు-నేడుపై న్యాయమూర్తి హర్షం
రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో పాఠశాలకు పూర్వ వైభవాన్నిచూస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న తీరుతో సర్కార్ విద్యావ్యవస్థకు మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు.
ఏపీలో నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను బాగు చేస్తున్న తీరుపై హైకోర్టు న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్ హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ స్కూల్ లో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు బొప్పూడి కృష్ణమోహన్ కూడా చదువుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో పాఠశాలకు పూర్వ వైభవాన్నిచూస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న తీరుతో సర్కార్ విద్యావ్యవస్థకు మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు.
కార్పొరేట్ విద్యా వ్యవస్థ కారణంగా 30ఏళ్లలో అనేక మార్పులు సంభవించాయన్నారు. ఈ కార్పొరేట్ విద్య వల్ల పిల్లలకు జరిగిన మంచి ఎంత అన్న దానిపై తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలన్నారు. కార్పొరేట్ వ్యవస్థతో పోటీ పడలేక ఎంతో ప్రఖ్యాతి గాంచిన ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలు కూడా కనుమరుగైపోయాయని ఆవేదన చెందారు. గతంలో కాలేజ్ విద్య పూర్తయిన తర్వాతే ఇంజనీరింగ్‌కు కోచింగ్ తీసుకునే వారమని.. ఇప్పుడు 8వ తరగతి నుంచే కోచింగ్ పేరుతో విద్యార్థులపై ఒత్తిడిని కార్పొరేట్ సంస్థలు పెంచుతున్నాయని న్యాయమూర్తి ఆవేదన చెందారు.