ప్రమాణస్వీకారానికి ఆ ఇద్దరు డుమ్మా.. కారణం ఇదేనా!
చంద్రబాబు తరపున నారా, నందమూరి ఫ్యామిలీలు కదిలివచ్చాయి. ఇక పవన్‌కల్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ కూడా తరలివచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది. జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ సహా 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా అతిరథ మహారథులంతా హాజరయ్యారు. చంద్రబాబు తరపున నారా, నందమూరి ఫ్యామిలీలు కదిలివచ్చాయి. ఇక పవన్‌కల్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ కూడా తరలివచ్చింది.
ఐతే ఈ కార్యక్రమానికి అటు నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ హాజరు కాలేదు. ఈ ఇద్దరికీ ఆహ్వానాలు పంపినట్లు మొదట వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు హాజరవుతారా, లేదా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. మీడియా సైతం ఈ అంశంపై బ్రేకింగ్స్‌తో వార్తలు నడిపించింది. కానీ, ప్రమాణస్వీకారానికి అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇటు అల్లు అర్జున్ కానీ హాజరు కాలేదు. నిజానికి ఆహ్వానం వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ ఆఫీసు క్లారిటీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపింది.
ఇక అల్లు అర్జున్ వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ ఆయనను టార్గెట్ చేశారు. సోషల్‌మీడియాలో అల్లు అర్జున్, పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఎన్నికల ఫలితాల రోజు పవన్‌కల్యాణ్‌కు బన్ని శుభాకాంక్షలు చెప్పినప్పటికీ ఫ్యాన్స్ మధ్య మంటలు చల్లారలేదు. ఐతే ప్రమాణస్వీకారానికి ఆయనకు ఆహ్వానం అందిందా లేదా అనేది క్లారిటీ లేదు. మొత్తానికైతే ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ప్రమాణస్వీకారానికి దూరంగానే ఉన్నారు.