Telugu Global
Andhra Pradesh

అప్పుడు టార్గెట్ చేశారు.. ఇప్పుడు మార్చేశారు

టీటీడీ ఈవోగా జె.శ్యామలరావుని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎన్నికల సమయంలో ఈసీ అండదండలతో కొందర్ని ఆల్రడీ ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరికొందరిపై వేటు వేస్తున్నారు.

అప్పుడు టార్గెట్ చేశారు.. ఇప్పుడు మార్చేశారు
X

చంద్రబాబు ప్రభుత్వంలో ఏయే అధికారులకు స్థానచలనం తప్పదనే విషయంలో ముందుగానే క్లారిటీ వచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా, ఎవరెవరిపై చంద్రబాబు ఆరోపణలు చేశారో, ఎవర్ని టీడీపీ టార్గెట్ చేసిందో.. వారందరికీ ఇప్పుడు స్థాన చలనం తప్పడంలేదు. ఎన్నికల సమయంలో ఈసీ అండదండలతో కొందర్ని ఆల్రడీ ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరికొందరిపై వేటు వేస్తున్నారు.

కీలక పోస్ట్ లకు సంబంధించి రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ముందుగా ట్రాన్స్ ఫర్ చేయించిన చంద్రబాబు ఇప్పుడు టీటీడీ ఈవోగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావుకి అవకాశం ఇచ్చారు. వైసీపీ హయాంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిపై ఇంతకు ముందే వేటు పడింది. ఆయన్ను ఈనెల 11న సెలవుపై పంపించగా.. ఆ స్థానంలో ఇప్పుడు జె.శ్యామలరావుని నియమించింది కొత్త ప్రభుత్వం.

తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదంటూనే.. తన తొలి రాజకీయ ప్రసంగానికి తిరుమలను వేదికగా చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ప్రక్షాళన అక్కడినుంచే మొదలవుతుందన్నారు. టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని చెప్పారు. గతంలో ఈవో ధర్మారెడ్డిపై ఎల్లో మీడియా వేదికగా పలు ఆరోపణలు చేసేవారు టీడీపీ నేతలు. కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన్ను ఏపీలో కొనసాగేలా చేసేందుకు జగన్ ప్రత్యేక అనుమతులు తీసుకున్నారని అన్నారు. ఒక అధికారికోసం సీఎం హోదాలో జగన్ కేంద్రం వద్ద తన పలుకుబడి ఉపయోగించారని ఆరోపించారు. ఇప్పుడు తాము అధికారంలోకి రాగానే ఆ మాటలకు చేతల రూపం ఇచ్చారు. టీడీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. టీడీపీ హయాంలో కొత్త చైర్మన్ ను కూడా నియమించాల్సి ఉంది. కేంద్ర మాజీ మంత్రి, గతంలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ దర్శకుడు, ఓ టీవీ ఛానెల్ అధినేత.. టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  15 Jun 2024 6:32 AM IST
Next Story