కడప స్టీల్ కు మరో ముందడుగు
8,800 కోట్ల రూపాయలతో ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ముందుకొచ్చింది. ఈ పెట్టుబడికి సీఎం అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోద ముద్రవేసింది.
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా మరో అడుగు ముందుకుపడింది. ప్లాంట్ నిర్మాణానికి అనేక సంస్థలు విముఖత చూపగా.. ప్రముఖ జేఎస్‌డబ్ల్యూ సంస్థను ప్రభుత్వం ఒప్పించింది. 8,800 కోట్ల రూపాయలతో ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ముందుకొచ్చింది. ఈ పెట్టుబడికి సీఎం అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోద ముద్రవేసింది.
స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి తొలి దశలో 3,300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది జేఎస్‌డబ్ల్యూ. మొదటి దశలో ఏటా 1 మిలియన్ టన్నులు, రెండో విడతలో 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. స్టీల్ ప్లాంట్ తో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ సంస్థకు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో ఫ్యాక్టరీలున్నాయి. ఏడాదికి 27 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఈ కంపెనీకి ఉంది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో మొత్తం 23వేల 985 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం అనేక సంస్థలను సంప్రదించగా పలు కారణాలతో అవి ముందుకు రాలేదు. జిల్లాకు సమీపంలో పోర్టు లేకపోవడం కూడా అందుకు ప్రధాన కారణం. అయితే జేఎస్‌డబ్ల్యూలో సీఎం జగన్ చొరవ తీసుకుని చర్చలు జరిపారు. ప్లాంట్ ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది.