పేరు మార్పుతో వైఎస్సార్ స్థాయి పెరగదు.. ఎన్టీఆర్ స్థాయి తగ్గదు..జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
'ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేరు.' అని ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును వైయస్సార్ వైద్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పేరు మార్పు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష టీడీపీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది.
నిన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును తీవ్రంగా ఖండించారు. హెల్త్ వర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని, 1986 లో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీ స్థాపించారని వారు గుర్తు చేశారు. తదనంతర కాలంలో చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలన్నారు. కాగా..ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు పై స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
'ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేరు.' అని ట్వీట్ చేశారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022
ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కూడా తప్పు పట్టారు. బీజేపీ, వామపక్షాల నాయకులు ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం సరికాదని అన్నారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు.