Telugu Global
Andhra Pradesh

అందరూ వచ్చారు.. ఎన్టీఆర్ రాలేదేం..?

భిన్న రాజకీయ నేపథ్యాలున్నవారు కూడా ఈ వేదికపై కనిపించడం విశేషం. కానీ మనవడు ఎన్టీఆర్ రాకపోవడం మాత్రం ఆ కార్యక్రమానికి లోటు అనే మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందరూ వచ్చారు.. ఎన్టీఆర్ రాలేదేం..?
X

హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు, ముందుగానే రాలేను అని సమాచారం ఇచ్చి ఉండొచ్చు. కానీ స్టేజీ అంతా నిండుగా ఉండగా, ఎన్టీఆర్ ఒక్కరే తక్కువ కావడం మాత్రం సామాన్య ప్రజలకు కష్టంగా తోచింది. చంద్రబాబు కావాలనుకుంది కూడా అదే, ఒకరకంగా ఎన్టీఆర్ ని పక్కనపెట్టడానికి, ఆయనపై ఉన్న సాఫ్ట్ యాంగిల్ ని తొలగించడానికి బాబు విశ్వ ప్రయత్నాలు చేశారు, నిన్నటి సభతో కాస్తో కూస్తో సక్సెస్ అయ్యారు.

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు సినీ రంగం నుంచి దాదాపు అన్ని ఫ్యామిలీల ప్రతినిధులు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ ప్రతినిధిగా రామ్ చరణ్ వచ్చారు, అటు అల్లు అరవింద్ కూడా వచ్చారు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సుమంత్ హాజరయ్యారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వచ్చారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా అక్కడినుంచి ఇక్కడికి వచ్చారు. అప్ కమింగ్ హీరోలు, హీరోయిన్లను కూడా ఈ కార్యక్రమానికి తీసుకు రావడంలో నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. జయసుధ, జయప్రద, మురళీమోహన్ లాంటి సీనియర్లు సరేసరి. భిన్న రాజకీయ నేపథ్యాలున్నవారు కూడా ఈ వేదికపై కనిపించడం విశేషం. కానీ మనవడు ఎన్టీఆర్ రాకపోవడం మాత్రం ఆ కార్యక్రమానికి లోటు అనే మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ తోపాటు కల్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించలేదు. జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం, ఆయన రాలేననే వివరణ అన్నీ బాగానే ఉన్నా.. తాత శతజయంతి ఉత్సవాల్లో ఆయన కనిపించకపోవడంతో నందమూరి అభిమానులు కూడా దిగులు పడ్డారు.

ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఎలా ప్రవర్తించారు, ఎలా ప్రవర్తిస్తారనే విషయం బహిరంగ రహస్యం. లోకేష్ కి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా పోటీ అనే విషయం బాబుకి బాగా తెలుసు. అందుకనే ఓ దశలో ప్రచారానికి వాడుకుని కూడా ఆ తర్వాత జూనియర్ ని పూర్తిగా పక్కనపెట్టేశారు బాబు. కుప్పంలో జై ఎన్టీఆర్ నినాదాలు వినిపించినా బలవంతంగా ఆపివేయించేవారు. తన సభల్లో ఎన్టీఆర్ పేరు వినిపించినా ఉడుక్కునేవారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా వీలైనంతగా చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా శతజయంతి ఉత్సవాలకు కూడా ఆయన సరైన కారణం చెప్పే ఆగిపోయారు. కానీ తారాలోకమంతా కనిపించిన స్టేజ్ పై ఎన్టీఆర్ లేకపోవడం మాత్రం లోటుగానే చెప్పుకోవాలి.

First Published:  21 May 2023 6:50 AM IST
Next Story