ఏపీ సీఐడీ చాలా గౌరవంగా వ్యవహరించింది- జర్నలిస్ట్ మూర్తి ప్రశంస
తన పట్ల సీఐడీ పోలీసులు చాలా హుందాగా వ్యవహరించారని వివరించారు. రెండు రోజుల విచారణలో సీఐడీ తనకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు నుంచి పలువురు టీడీపీ నాయకులు ఏపీ సీఐడీపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సీఐడీ విచారణకు వెళ్తే కొడుతున్నారంటూ ఆరోపిస్తూ వచ్చారు. టీవీ5 జర్నలిస్ట్ మూర్తిని కూడా సీఐడీ పోలీసులు కొట్టబోతున్నారని, కుట్ర చేయబోతున్నారని టీడీపీ నేతలు హడావుడి చేశారు. అయితే విచారణ అనంతరం జర్నలిస్ట్ మూర్తి ఏపీ సీఐడీ తన పట్ల ఎలా వ్యవహరించిందన్న దానిపై వివరణ ఇచ్చారు.
తన పట్ల సీఐడీ పోలీసులు చాలా హుందాగా వ్యవహరించారని వివరించారు. రెండు రోజుల విచారణలో సీఐడీ తనకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నారు. తన ఆత్మగౌరవానికి భంగం కలించేలా ఎలాంటి పనిచేయలేదన్నారు. చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించారన్నారు. విచారణలో భాగంగా అనేక ప్రశ్నలు సంధించారని వాటి గురించి తాను చెప్పబోనని.. అది వారి వృత్తిధర్మంగానే తాను చూస్తున్నానన్నారు.
ఎక్కడా అవమానించేలా గానీ, విసిగించేలా గానీ, అనుచిత సైగలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం గానీ చేయలేదన్నారు. కోర్టు చెప్పిన విధంగానే తనతో వ్యవహరించారన్నారు. విచారణ సమయంలో అనేక మంది తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారని.. వారందరికీ మూర్తి ధన్యవాదాలు తెలిపారు.