విజయమ్మతో జేసీ భేటీ...ట్విస్ట్ ఏంటంటే?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో తెలుగుదేశం నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో తెలుగుదేశం నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. జేసీ సోదరులు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఐతే విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలున్నాయంటూ వార్తలు వచ్చాయి.
ఐతే విజయమ్మతో భేటీపై క్లారిటీ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ మేరకు ట్వీట్ చేశారు. తాను హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌కు చికిత్స కోసం వెళ్తే..అక్కడ లాంజ్‌లో విజయమ్మ కనిపించారని చెప్పారు. దీంతో విజయమ్మ బాగోగులు ఆరా తీసి పలకరించానని చెప్పారు. అంతే కానీ ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రత్యేకత లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
నేడు హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రి నందు చికిత్స కోసం వెళ్ళిన జెసి ప్రభాకర్ రెడ్డి గారికి waiting longue నందు YS విజయమ్మ గారు కనిపించడం తో ఆమె బాగోగుల గురించి పలకరించి మాట్లాడటం జరిగింది.
— JC Prabhakar Reddy (@JCPRTDP) July 29, 2024
ఈ కలయిక లో ఎటువంటి రాజకీయ ప్రత్యేకత లేదు.#adminpost pic.twitter.com/oVyVpbKBrp
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన కేబినెట్‌లో జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలం మంత్రిగా ఉన్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం కండువా కప్పుకున్నారు జేసీ సోదరులు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ట్రావెల్స్‌కు సంబంధించిన అక్రమాలు బయటకు రావడంతో కొన్నాళ్లూ జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో గడిపారు. ఇక ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండగా..జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.