మాకెందుకు హైకోర్టు.. మేం మారిపోయాం- జేసీ ప్రభాకర్ రెడ్డి
రాయలసీమలో 20ఏళ్ల క్రితం హత్యలు చేసుకున్నామని.. అప్పుడు హైకోర్టు అవసరం ఉండేదని.. ఇప్పుడు తాము మారిపోయామని, బాగా చదువుకున్నామని కాబట్టి హైకోర్టు అవసరం లేదని జేసీ వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల పేరుతో జగన్ కేవలం మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను కలిసి జేసీ సంఘీభావం తెలిపారు. అమరావతి రాజధానిగా ఫిక్స్ అయిపోయిందని.. అది అందరికీ తెలుసన్నారు. అసలు ఆరునెలల తర్వాత సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమకు న్యాయ రాజధాని అంటున్నారని.. తమకు అవసరం లేదన్నారు.
రాయలసీమలో 20ఏళ్ల క్రితం హత్యలు చేసుకున్నామని.. అప్పుడు హైకోర్టు అవసరం ఉండేదని.. ఇప్పుడు తాము మారిపోయామని, బాగా చదువుకున్నామని కాబట్టి హైకోర్టు అవసరం లేదని జేసీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాంబు అంటే ఎలా ఉంటుందో కూడా తమ పిల్లలకు తెలియడం లేదన్నారు. రాయలసీమ హార్టికల్చర్‌తో బాగా అభివృద్ది చెందుతోందన్నారు.
ఈ ప్రభుత్వం వచ్చాక 69 కేసులు పెట్టారని.. కానీ ఇప్పటి వరకు తాను కోర్టు ముఖమే చూడలేదన్నారు. జైలు మాత్రం చూశానన్నారు. అమరావతి వాళ్లు ఉత్తరాంధ్రకు పాదయాత్ర చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తాను రాయలసీమ నుంచి వచ్చానని.. దారిలో ఎవరూ తనను ఆపలేదన్నారు. జగన్‌కు ఏమీ చేతగావడం లేదని, డబ్బులు కూడా లేవని అందుకే ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారని, ప్రజల మధ్య పుల్లలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.