రాయలసీమను తెలంగాణలో కలపండి.. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పడి ఏళ్లు గడిచిపోతున్నప్పటికీ జేసీ వంటి వారు మాత్రం రాయల తెలంగాణ కోసం అప్పుడప్పుడు గళమెత్తుతున్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు నుంచి రాయల తెలంగాణ ప్రకటించాలని నినదిస్తున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అదే డిమాండ్ వినిపించారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. రాయల తెలంగాణ ఏర్పడితే రాయలసీమకు సాగునీటి కష్టాలు తొలగుతాయని ఆయన అన్నారు.
రాయలసీమను తెలంగాణలో కలుపుకోవడానికి ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆయన చెప్పారు. రాష్ట్రాలను విడగొట్టడం చాలా కష్టమని.. కలపడం సులభమని జేసీ అన్నారు. ఒకవేళ రాయలసీమను తెలంగాణలో కలపలేని పక్షంలో.. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇచ్చినా సరిపోతుందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణపై జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సెన్సేషన్ గా మారాయి.
నిజానికి రాయలసీమ నుంచి రాయల తెలంగాణ డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ ఏర్పడే సమయంలో రాయలసీమకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాయల తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ అధిష్టానం కూడా మొదట రాయల తెలంగాణ ఇవ్వడానికే మొగ్గుచూపింది. అయితే అప్పట్లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు సహా పలువురు రాయల తెలంగాణను వ్యతిరేకించారు.
అయినప్పటికీ అప్పట్లో ఎంపీలుగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డితో పాటు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి వంటి నేతలు చివరివరకు రాయల తెలంగాణ ఇవ్వాలని పట్టుబట్టారు. రాయల తెలంగాణ తమకు ఆమోదమేనని సీమలో స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి సంతకాల సేకరణ కూడా చేపట్టారు.
అయితే తెలంగాణ నేతల ముందర వీరి పాచికలు పారలేదు. అప్పట్లో 10 జిల్లాలతో ఉన్న తెలంగాణను మాత్రమే ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు. తెలంగాణ ఏర్పడి ఏళ్లు గడిచిపోతున్నప్పటికీ జేసీ వంటి వారు మాత్రం రాయల తెలంగాణ కోసం అప్పుడప్పుడు గళమెత్తుతున్నారు. అయితే ఇలా నేతలు గళమెత్తిన ప్రతిసారి ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మీ ఆస్తుల కోసం ఇటువంటి డిమాండ్లు తీసుకురావద్దని గట్టిగానే చెబుతున్నారు.