Telugu Global
Andhra Pradesh

మిస్సింగ్ కేసులపై కేంద్రం వివరణ.. పవన్ పై ట్రోలింగ్

ఏపీలో మహిళల మిస్సింగ్ కేసుల వ్యవహారంపై పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ట్రోలింగ్ మొదలు పెట్టింది.

మిస్సింగ్ కేసులపై కేంద్రం వివరణ.. పవన్ పై ట్రోలింగ్
X

ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులు ఏడాదికేడాది ఎక్కువవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ, వారు సేకరిస్తున్న వ్యక్తిగత వివరాలు కూడా ఈ మిస్సింగ్ కేసులకు కారణం అని నిందలు వేశారు. ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని అన్నారు. అయితే పవన్ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని సాక్షాత్తూ కేంద్రం ఒప్పుకున్నట్టు వైసీపీ చెబుతోంది. లోక్‌ సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో మిస్ అయిన వారి సంఖ్యతోపాటు, పోలీసులు గుర్తించి తిరిగి తీసుకొచ్చిన వారి సంఖ్య కూడా ఉన్నాయి. మిస్ అయిన వారంతా దాదాపు తిరిగొచ్చారని, కానీ పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేశారని వైసీపీ అంటోంది.


దీనికి జనసేన కూడా కౌంటర్ రెడీ చేసుకుంది. పవన్ కల్యాణ్ గతంలో మిస్ అయిన వారి సంఖ్య మాత్రమే చెప్పారని అంటోంది జనసేన. 30వేల మంది మిస్ అయ్యారని పవన్ చెప్పిన మాట వాస్తవం అని, ఒకవేళ వారు తిరిగొచ్చినా, ఏ పరిస్థితుల్లో వారు ఇంటికొచ్చారో గమనించాలని అంటున్నారు జనసేన నేతలు. 2018 పోలిస్తే 2022 లో మహిళల మిస్సింగ్ కేసులు భారీగా పెరిగాయని, దేశ వ్యాప్తంగా 29శాతం కేసులు పెరిగితే, ఏపీలో మాత్రం ఆ పెరుగుదల 73శాతంగా ఉందని జనసేన నేతలు అంటున్నారు. అప్పటి సీఎం జగన్ కనీసం మహిళల మిస్సింగ్ కేసులపై సమీక్ష కూడా జరపలేదని విమర్శిస్తున్నారు.


మహిళల మిస్సింగ్ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వాలంటీర్లను కించపరిచేలా ఉన్నాయని గత ప్రభుత్వం ఆయనపై కేసు కూడా నమోదు చేసింది. అయితే ఆ కేసు కొట్టివేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు పరువునష్టం కేసులో దిగువ కోర్టులో విచారణను 4 వారాలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కేంద్ర హోం శాఖ నివేదికతో పవన్ కల్యాణ్ ఆరోపణలన్నీ అవాస్తం అని తేలాయంటూ వైసీపీ విమర్శలు చేస్తున్న వేళ ఆయనపై పరువునష్టం కేసు వాయిదా పడటం విశేషం.

First Published:  31 July 2024 9:51 AM IST
Next Story