Telugu Global
Andhra Pradesh

మెయిన్ టార్గెట్ జనసేనేనా?

తమిళనాడులో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రోమ్మోహన్ రావు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తోటనే దగ్గరుండి రామ్మోహన్ రావును కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్ళారు. జరుగుతున్నది చూస్తుంటే వీలైనంత తొందరలో జనసేనలో యాక్టివ్‌గా ఉన్న మరికొందరిని బీఆర్ఎస్‌లోకి ఆకర్షించేందుకు ప్లాన్లు వేసినట్లు అర్ధమవుతోంది.

మెయిన్ టార్గెట్ జనసేనేనా?
X

ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్న బీఆర్ఎస్ మెయిన్ టార్గెట్ జనసేన లాగే ఉంది. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి, ఫైనాన్షియర్ అయిన తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ సలహాదారు, తమిళనాడులో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రోమ్మోహన్ రావు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తోటనే దగ్గరుండి రామ్మోహన్ రావును కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్ళారు. జరుగుతున్నది చూస్తుంటే వీలైనంత తొందరలో జనసేనలో యాక్టివ్‌గా ఉన్న మరికొందరిని బీఆర్ఎస్‌లోకి ఆకర్షించేందుకు ప్లాన్లు వేసినట్లు అర్ధమవుతోంది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇప్పటికే ఏపీ అధ్య‌క్షుడు తోట ప్రతినిధులుగా కొంతమంది ఉభయ గోదావరి జిల్లాల్లోని జనసేన నేతలు, కాపు ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నారు. పాలకొల్లులో గుణ్ణం నాగబాబు, భీమవరంలో యర్రా నవీన్, కాకినాడలో ముద్రగడ పద్మనాభంతో పాటు నిడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, నరసాపురం లాంటి నియోజకవర్గాల్లో చాలామందిని వ్యక్తిగతంగా కలిసినట్లు సమాచారం. వీరందరు బీఆర్ఎస్‌లో చేరితే పార్టీలో మంచి ప్రాధాన్యతతో పాటు టికెట్లు గ్యారెంటీ అన్నట్లుగా హామీలను ఇస్తున్నారట.

మొత్తానికి తోట ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు చేస్తున్న పర్యటనలు, భేటీలపై కాపుల్లో బాగా చర్చ జరుగుతున్నది. కాపు ప్రముఖుల్లో కొందరు ఇప్పటికే డైరెక్ట్‌గా కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచారంలో ఉంది. ఈనెలాఖరులోగా ఎంత మందిని వీలైతే అంత మందిని ఆకర్షించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఇందులో భాగంగానే తోట చంద్రశేఖర్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సంవత్సరాల తరబడి తోట జనసేనలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే పవన్ కన్నా చాలామంది తోటతోనే సన్నిహితంగా ఉంటారు.

తన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని వీలైనంత మందిని బీఆర్ఎస్‌లో చేర్చాలని తోట టార్గెట్‌గా పెట్టుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన తోట రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాలోని చాలామంది నేతలతో ఇప్పటికే నేరుగా మాట్లాడినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ నుండి మొదటి దెబ్బ జనసేనకు తర్వాత దెబ్బ టీడీపీకి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లే అనుమానంగా ఉంది.

First Published:  12 Jan 2023 10:21 AM IST
Next Story