ఏపీ మాజీ మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేసిన జనసేన!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో 13 నెలల్లో రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో తమ సత్తా చాటాలని జనసేన పార్టీ నిర్ణయించుకున్నది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండటానికి అవసరం అయితే ప్రతిపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నాళ్లుగానో చెబుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. ఆ తర్వత వచ్చిన ఎన్నికల్లో పోటీ చేయకుండానే బీజేపీ, టీడీపికి మద్దతు ఇచ్చారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని ప్రయత్నించినా.. చివరకు అధినేత పవన్ కల్యాణే రెండు చోట్ల ఓడిపోయారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో 13 నెలల్లో రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ సారి పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా జరపాలని భావిస్తున్నారు. ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించనున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ మనోహర్ తెలిపారు. నాదెండ్ల ఈ ప్రకటన చేయగానే ఏపీ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది.
వైసీపీ పార్టీలో కీలక నాయకుడిగా.. సీఎం జగన్ తొలి క్యాబినెట్‌లో పని చేసిన పేర్ని నాని నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సమావేశం నిర్వహించడం ఆశ్చర్యకరంగా మారింది. కాపు సామాజికవర్గ అనధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్.. ఏకంగా కాపు ఎమ్మెల్యే పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలోనే ఆవిర్భావ సభ నిర్వహిస్తానని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ స్ట్రాటజీ ఏంటిలా ఉందని అందరూ ఆలోచిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం చాలా కీలకమైన నియోజకవర్గం. ఈ సెగ్మెంట్‌తో పాటు పక్కన ఉన్న పలు నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గపు ఆధిపత్యం కొనసాగుతోంది. అయినా.. మచిలీపట్నంలో మాత్రం పేర్ని నాని కుటుంబానిదే ఆధిపత్యం. సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న ఈ సీనియర్ నేత నియోజకవర్గంలోనే ఆవిర్భావ సభ విజయవంతం చేయడం ద్వారా.. జగన్‌కు ఒక సందేశం పంపడమే కాకుండా.. తాను కేవలం కాపు వర్గానికి మాత్రమే నేతను కాదనే వివరణ ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని నియోజకవర్గాన్ని జనసేన 10వ ఆవిర్భావ సభ కోసం ఎంపిక చేసుకుందని తెలుస్తుంది.
నిరుడు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఇప్పటంలో నిర్వహించినప్పుడు వివాదాస్పదంగా మారింది. జనసేన, వైసీపీకి మధ్య కొద్ది కాలం మాటల యుద్దమే నడిచింది. అయితే ఈ సారి మాత్రం జనసేన ముందుగానే మచిలీపట్నంలో స్థలం నిర్ణయించి, స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకున్నది. ఆ తర్వాతే నాదెండ్ మనోహర్ అధికార ప్రకటన చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి ఆవిర్భావ సభకు పెద్దగా ఆటంకాలు లేకపోయినా.. కాపు నాయకుడు అయిన పేర్ని నానిని టార్గెట్ చేయడంపై మాత్రం ఆ సామాజిక వర్గంలో చీలిక వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. జనసేన ఇలాంటి తప్పులే ప్రతీ సారి చేస్తోందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం.
— JanaSena Party (@JanaSenaParty) March 1, 2023
JanaSena Party PAC Chairman Shri @mnadendla Press Meet at Mangalagiri Party Office
Link: https://t.co/UpiO7SKqD5