Telugu Global
Andhra Pradesh

జగనన్నకు తోడుగా.. స్టిక్కర్లు కాదు ఏకంగా పచ్చబొట్లే

గతంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే క్యాంపెయిన్ బయటకు రాగానే, జనసేన నుంచి మాకు నమ్మకం లేదు దొరా అంటూ కౌంటర్లు పడ్డాయి. ఇప్పుడు జగనన్నకు తోడుగా అనే స్టికర్ల కార్యక్రమంపై కూడా జనసేన విమర్శలు మొదలు పెట్టింది.

జగనన్నకు తోడుగా.. స్టిక్కర్లు కాదు ఏకంగా పచ్చబొట్లే
X

నువ్వే మా నమ్మకం జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్, జగనన్నకు తోడుగా.. ఇలా రకరకాల కార్యక్రమాలతో జనంలోకి రాబోతోంది వైసీపీ. ఇందులో భాగంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ల కార్యక్రమంపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇంటింటికీ జగన్ ఫొటోతో ఉన్న స్టిక్కర్లు అంటిస్తారని, సెల్ ఫోన్లకు కూడా వెనక ఈ స్టిక్కర్లు వేస్తారని చెబుతున్నారు. వైసీపీ అంటే ఇష్టం లేనివారెవరో ఈ స్టిక్కర్ల కార్యక్రమం ద్వారా తేలిపోతుందని, వారికి సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. వీటిల్లో ఏది నిజం, ఎంతవరకు నిజం అనేది ముందు ముందు తేలిపోతుంది. అయితే ఈ స్టిక్కర్ల కార్యక్రమంపై ఇప్పుడు జనసేన కౌంటర్లు వేస్తోంది. స్టిక్కర్లు చిరిగిపోయే అవకాశముందని పచ్చబొట్లు వేయిస్తే శాశ్వతంగా ఉంటాయని అంటున్నారు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్.

జనాలపై సీఎం జగన్ కు నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై మాత్రం జగన్ కి నమ్మకం లేదని అంటున్నారు. అందుకే అందర్నీ అనుమానంగా చూస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా అలానే బయటకొచ్చాయని చెప్పారు నాదెండ్ల మనోహర్. ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేసే విధంగా ఎమ్మెల్యేలందరికీ జగనన్నకు తోడుగా అనే పచ్చబొట్టు పొడిపించాలని సూచించారాయన. అలాంటి పచ్చబొట్టు పొడిపిస్తే ఎమ్మెల్యేలు ఇక ఎక్కడికీ వెళ్లరని, గడప గడప కార్యక్రమానికి వెళ్లినప్పుడు కూడా ఆ పచ్చబొట్లు చూపించి ప్రజలకి మరింత నమ్మకం కలిగించొచ్చని, ఎమ్మెల్యేలే పచ్చబొట్లు పొడిపించుకున్నారంటే.. ఇళ్లకు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించుకోడానికి ప్రజలు పెద్దగా ఇబ్బంది పడరని సలహా ఇచ్చారు.


జనసేన కౌంటర్లు..

గతంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే క్యాంపెయిన్ బయటకు రాగానే, జనసేన నుంచి మాకు నమ్మకం లేదు దొరా అంటూ కౌంటర్లు పడ్డాయి. ఇప్పుడు జగనన్నకు తోడుగా అనే స్టికర్ల కార్యక్రమంపై కూడా జనసేన విమర్శలు మొదలు పెట్టింది. స్టిక్కర్లకంటే ముందు ఎమ్మెల్యేలకు పచ్చబొట్లు పొడవాలంటున్నారు జనసేన నేతలు. సీఎం జగన్ కు పబ్లిసిటీ పిచ్చి బాగా ముదిరిపోయిందని, అందుకే ప్రతి ఇంటిపై తన స్టిక్కర్ ఉండాలనుకుంటున్నారని, ప్రతి సెల్ ఫోన్ పై తన బొమ్మ కనపడాలనుకుంటున్నారని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్.

First Published:  15 Feb 2023 11:50 AM IST
Next Story