Telugu Global
Andhra Pradesh

ఈనెల 27న ఇప్పటంకు పవన్.. ఈసారి ఏం జరుగుతుందో..?

ఇప్పటంపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టడానికి అసలు కారణం ఏంటి..? ఇప్పటం గ్రామం పవన్ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో లేదు, పోనీ జనసేన తరపున 2024లో మంగళగిరిలో అభ్యర్థిని నిలబెడతారా అంటే.. అనుమానమే.

ఈనెల 27న ఇప్పటంకు పవన్.. ఈసారి ఏం జరుగుతుందో..?
X

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని ఓ చిన్న పల్లెటూరు ఇప్పటం. ఇప్పటి వరకూ ఆ పేరు చుట్టుపక్కల జిల్లాలవారికి కూడా తెలియదు. కానీ జనసేన సభకు ఆ గ్రామస్తులు స్థలం ఇవ్వడం, ఆ తర్వాత కొన్నాళ్లకు గ్రామంలో రోడ్ల విస్తరణ, ప్రహరీల కూల్చివేత, పవన్ కల్యాణ్ పర్యటన.. ఇలా వరుస సంఘటనలతో ఇప్పటం రాజకీయ కేంద్ర బిందువైంది. ఈనెల 5న ఇప్పటం గ్రామంలో పరామర్శకు వచ్చిన పవన్, కారుపైకెక్కి కూర్చుని ఎంత హంగామా చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ కల్యాణ్ ఇప్పటం వస్తున్నారు. ఈనెల 27న డేట్ ఫిక్స్ చేశారు.

ఈసారి ఎందుకు..?

రోడ్ల విస్తరణలో జరిగిన కూల్చివేతల కారణంగా నష్టపోయిన బాధితులకు పరిహారం అందించేందుకు పవన్ కల్యాణ్ ఈనెల 27న ఇప్పటం వస్తున్నారు. గతంలో వచ్చినప్పుడు లక్ష రూపాయల చొప్పున వ్యక్తిగతంగా తాను పరిహారమిస్తానని హామీ ఇచ్చారు పవన్, ఆ హామీ నెరవేర్చుకోడానికి పవన్ ఇప్పటంకు వస్తున్నట్టు పోలీసులకు జనసేన నేతలు సమాచారమిచ్చారు. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు.

లోకేష్ కోసమేనా..?

ఇప్పటంపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టడానికి అసలు కారణం ఏంటి..? ఇప్పటం గ్రామం పవన్ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో లేదు, పోనీ జనసేన తరపున 2024లో మంగళగిరిలో అభ్యర్థిని నిలబెడతారా అంటే, అనుమానమే. ఇప్పటంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచితే నారా లోకేష్ కే అది లాభం చేకూర్చే అవకాశముంది. మంగళగిరిలో లోకేష్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం కష్టపడుతున్నారు. ఇప్పటంలో పవన్ అభిమానులు పెరిగినా, వైసీపీ వ్యతిరేకులు పెరిగినా చివరిగా లోకేష్ కే మేలు జరుగుతుంది. ఒకరకంగా పవన్ యాత్రలు, పర్యటనలు టీడీపీకి సంతోషాన్నిస్తున్నాయనే చెప్పాలి.

First Published:  23 Nov 2022 8:53 AM IST
Next Story