Telugu Global
Andhra Pradesh

ఆ రోజు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయబట్టే ఏపీకి ఈ దుస్థితి..

ప్రస్తుతం వైసీపీలో మంత్రులుగా ఉన్నవారు, మంత్రులుగా పనిచేసిన వారు దగ్గరుండి ఆనాడు ప్రజారాజ్యాన్ని విలీనం చేయించారని చెప్పారు. అంత నష్టం జరిగినా తాను ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు.

ఆ రోజు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయబట్టే ఏపీకి ఈ దుస్థితి..
X

కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడూ ఆయన ప్రజారాజ్యం ప్రస్తావన తెచ్చేవారు కాదు. కానీ తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీ విలీనం గురించి మాట్లాడారు పవన్. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు ఏపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ప్రస్తుతం వైసీపీలో మంత్రులుగా ఉన్నవారు, మంత్రులుగా పనిచేసిన వారు దగ్గరుండి ఆనాడు ప్రజారాజ్యాన్ని విలీనం చేయించారని చెప్పారు. అంత నష్టం జరిగినా తాను ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. 9 నెలల్లో అధికారంలోకి వస్తాననే ఉద్దేశంతో తాను జనసేన పార్టీ పెట్టలేదని, రాజకీయాల వెనుక ఉన్న కష్టనష్టాలు తనకు తెలుసని, అందుకే పాతికేళ్ల ప్రస్థానం అని చెప్పానని వివరించారు.

పద్యం, మద్యం..

రాయలసీమ చదువుల నేల, పద్యం పుట్టిన ఈ నేలలో నేడు మద్యం ఏరులై పారుతోందని అన్నారు పవన్ కల్యాణ్. ఇంటింటికీ చీప్‌ లిక్కర్‌ వచ్చిందని యువత చెబుతున్నారని, ఉపాధి లేకపోతే యువత ఏం చేయాలని ప్రశ్నించారు. ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని, కానీ అది ఏపీలో జరగడంలేదని మండిపడ్డారు. కడపజిల్లా సిద్ధవటంలో కౌలు రైతు భరోసా యాత్ర సభలో పాల్గొన్న పవన్.. బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 173 మందికి రూ.1.73 కోట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే తాను సొంత నిధులనుంచి పరిహారం పంపిణీ చేయాల్సి వచ్చిందని చెప్పారు పవన్. ఏపీలో కౌలు రైతులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదన్నారు పవన్.

కులం లేదు, మతం లేదు..

తానెప్పుడూ కులమతాల గురించి ఆలోచించలేదని, కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని అన్నారు పవన్. కులం, మతం, ప్రాంతం దాటి వచ్చిన మనిషిని తాను అని చెప్పుకొచ్చారు. వ్యక్తులపై తానెప్పుడూ పోరాటం చేయనని, వారి భావజాలంతోనే విభేదిస్తానన్నారు. వారసత్వ రాజకీయాలకు కొంతైనా అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. అన్న పట్టించుకోలేదని చెల్లెలు మరో పార్టీ పెట్టారని జగన్, షర్మిలపై సెటైర్లు వేశారు పవన్. తాము అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు. రాయలసీమలో వెనుకబడిన వర్గాలవారంతా తలెత్తుకునేలా చేస్తామన్నారు. ఒక్కసారి జనసేనను నమ్మి ఆదరించండని విజ్ఞప్తి చేశారు పవన్.

First Published:  20 Aug 2022 2:06 PM GMT
Next Story