మరింత కన్ఫ్యూజన్, మరింత క్లారిటీ..
జనసైనికులతోపాటు, జనసేనానికి కూడా ఇంకా దీనిపై క్లారిటీ లేదు. ఎన్నికలనాటికి ఏదో ఒక విషయం తేలకపోతుందా అంటూ పవన్ కల్యాణ్ కూడా కన్ఫ్యూజన్లోనే కాలం గడుపుతున్నారు.
♦ ఏపీలో జనసేన పార్టీ ఒంటరిగా ఉందా..?
♦ బీజేపీతో పొత్తులో ఉందా..?
♦ టీడీపీతో పొత్తులోకి వెళ్తుందా..?
జనసైనికులతోపాటు, జనసేనానికి కూడా ఇంకా దీనిపై క్లారిటీ లేదు. ఎన్నికలనాటికి ఏదో ఒక విషయం తేలకపోతుందా అంటూ పవన్ కల్యాణ్ కూడా కన్ఫ్యూజన్లోనే కాలం గడుపుతున్నారు. కానీ మెల్ల మెల్లగా పవన్ ఓ క్లారిటీకీ వస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో ప్రతిపక్ష ఓట్లను చీల్చేది లేదని సిగ్నల్ ఇస్తున్నారు పవన్. వైసీపీని ఓడించడమే తన ప్రధాన అజెండా అంటున్నారు. అంటే పరోక్షంగా 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని తిరుపతి జనవాణి సభలో అధికారికంగా పవన్ కన్ఫామ్ చేశారని అనుకోవచ్చు.
టీడీపీకి, వైసీపీకి కొమ్ముకాయను..
అదే సమయంలో తాను టీడీపీకి కానీ, వైసీపీకి కానీ కొమ్ముకాసేందుకు రాజకీయాల్లోకి రాలేదని చెబుతూ మరింత కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారు పవన్ కల్యాణ్. ఏపీలో మూడో ప్రత్యామ్నాయం అవసరం అని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇంతకీ పవన్ మనసులో ఏముంది, ఎన్నికలనాటికి అది ఎలా మారుతుందనేది మాత్రం ఊహలకు అందడంలేదు.
ఆంధ్రా థామస్..
తనని చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారని, సీఎం జగన్ కి సీబీఐ దత్తపుత్రుడు అని పేరు పెట్టిన పవన్, ఇప్పుడు కొత్తగా ఆంధ్రా థామస్ అంటూ మరో పేరు పెట్టారు. అవెంజర్ సినిమాలో థామస్ ఆరు రాళ్లకోసం ప్రయత్నించి అందర్నీ చంపుతాడని, ఇప్పుడు ఏపీలో కూడా సీఎం జగన్ నవరత్నాలు అంటూ అందర్నీ చంపుతున్నాడని మండిపడ్డారు. ఇంటికి దూరంగా వాహనాలను ఆపేసి.. ఇంటి దగ్గరకు నాయకులు నడచి వెళ్లే సంస్కృతిని జగన్ మొదలు పెట్టారని, అలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు. ఆధిపత్య ధోరణి మారాలని చెప్పారు.
2014 ఎన్నికల్లో మోదీ అభ్యర్థన వల్లే తాను టీడీపీతో కలిశానని చెబుతున్న పవన్ మునుగోడులో పోటీ చేయడం వల్ల ఓట్లు వస్తాయి కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదని నిర్వేదం వ్యక్తం చేశారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో పరిమిత సీట్లలో పోటీ చేస్తానని చెప్పారు. విధ్వంస రాజకీయాలు మితిమీరినప్పుడు తాను శత్రువులతో కూడా కలుస్తానన్నారు. ఏపీ భవిష్యత్ కోసం కొన్ని పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు.