Telugu Global
Andhra Pradesh

జనసేనకు గట్టి నేత దొరికారా?

పంచకర్ల ఇప్పటికి రెండుసార్లు గెలిచారు. 2009లో పెందుర్తిలో ప్రజారాజ్యం పార్టీ తరపున, 2014లో యలమంచిలిలో టీడీపీ తరపున గెలిచారు. రెండు నియోజకవర్గాల్లో రెండు ఎన్నికల్లో గెలిచారంటే రమేష్ గట్టి నేతనే అనుకోవాలి.

జనసేనకు గట్టి నేత దొరికారా?
X

జనసేనకు గట్టి నేత దొరికారా?

మొత్తానికి జనసేన పార్టీకి ఇంత కాలానికి ఒక గట్టి నేత దొరికారనే అనుకోవాలి. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళయినా గట్టి నేతలు అనుకున్నవాళ్ళు ఇంతవరకు లేరనే చెప్పాలి. పవన్‌ను గట్టి నేతని చెప్పేందుకు లేదు. పవన్ కేవలం ఒక సినీ సెలబ్రిటి మాత్రమే. సినీ సెలబ్రిటి+కాపు సామాజికవర్గం కాబట్టి వారాహి యాత్రలో అభిమానులు విపరీతంగా పాల్గొంటున్నారు.

పోయిన ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్‌ను గట్టి నేతని అనేందుకు లేదు. ఇక పవన్ రైట్ హ్యాండ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ని కూడా ప్రముఖుడని చెప్పాలంతే. నాదెండ్ల కూడా గట్టి నేతేమీ కాదు. కాంగ్రెస్ గాలిలో రెండుసార్లు తెనాలిలో గెలిచారు. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత పోటీ చేస్తే ఓడిపోయారు. వీళ్ళిద్దరు కూడా చెప్పుకోవటానికి మూడో నేతే లేరు.

ఈ నేపథ్యంలోనే పంచకర్ల రమేష్ జనసేనలో చేరబోతున్నారు. పంచకర్ల ఇప్పటికి రెండుసార్లు గెలిచారు. 2009లో పెందుర్తిలో ప్రజారాజ్యం పార్టీ తరపున, 2014లో యలమంచిలిలో టీడీపీ తరపున గెలిచారు. రెండు నియోజకవర్గాల్లో రెండు ఎన్నికల్లో గెలిచారంటే రమేష్ గట్టి నేతనే అనుకోవాలి. బలమైన క్యాడర్ ఉంది కాబట్టి రెండు నియోజకవర్గాల్లో గెలవగలిగారు. అందుకనే పంచకర్లను గట్టినేతనేది. రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఇలాంటి పంచకర్లలు జనసేనకు చాలా నియోజకవర్గాల్లో అవసరం.

చీరాలలో ఆమంచి స్వాములు కూడా చేరారు. స్వాములు అంటే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తమ్ముడు. నియోజకవర్గంలో స్వాములు బాగా పాపులర్. ఎందుకంటే తెర ముందు కృష్ణమోహన్ కనబడితే తెర వెనుక స్వాములే వ్యవహారాలు చక్కపెట్టేది. కాకపోతే ఎమ్మెల్యే తమ్ముడి హోదాలో నియోజకవర్గమంతా తిరిగి పాపులరయ్యారు కాబట్టే ప్రముఖుడన్నది. బహుశా రాబోయే ఎన్నికల్లో ఎక్కడో ఒకచోట స్వాములు కూడా పోటీ చేస్తారేమో చూడాలి. మొత్తానికి రమేష్ పార్టీలో చేరిన తర్వాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ద్వితీయ స్థాయి నేతలను జనసేనలోకి లాక్కొస్తారేమో. అప్పుడు ఇంకాస్త బలపడుతుందని అనుకోవాలి.

First Published:  17 July 2023 11:46 AM IST
Next Story