Telugu Global
Andhra Pradesh

కన్నాతో నాదెండ్ల మంతనాలు.. జనసేనలోకి ఆహ్వానించారా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణకు మధ్య ఇటీవల విభేదాలు బహిర్గతమయ్యాయి. వీర్రాజు నాయకత్వంపై కన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

కన్నాతో నాదెండ్ల మంతనాలు.. జనసేనలోకి ఆహ్వానించారా?
X

ఏపీ బీజేపీకి షాక్ తగలనున్నదా? మిత్రపక్షమైన జనసేన ఆ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బుధవారం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, అసంతృప్త నేత కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెళ్లారు. దాదాపు 40 నిమిషాల సేపు వీరిద్దరి మధ్య ఏకాంతంగా చర్చలు జరిగాయి. కన్నాను నాదెండ్ల జనసేనలోకి ఆహ్వానించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే లక్ష్మినారాయణ మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా బయటకు వెల్లడించలేదు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణకు మధ్య ఇటీవల విభేదాలు బహిర్గతమయ్యాయి. వీర్రాజు నాయకత్వంపై కన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వ్యవహార శైలి కారణంగా బీజేపీ రాష్ట్రంలో ఎదగలేకపోతోందని గతంలో విమర్శించారు. ఏపీలో పార్టీ వ్యవహారాలపై అధిష్టానం దృష్టి పెట్టాల్సి ఉందని, ఇక్కడి నాయకత్వం వైఫల్యం చెందిందని నేరుగా వీర్రాజుపై ఆరోపణలు చేశారు. ఒకానొక దశలో కన్నా పార్టీ మారి టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ కన్నా మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. అకస్మాతుగా బీజేపీ మిత్రపక్షమైన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా కన్నా ఇంటికి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జనసేన పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని నాదెండ్ల చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు జనసేనకు మీలాంటి సీనియర్ల అండ కావాలని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జనసేన మంచి ఫలితాలు సాధించబోతోందని ఆయనకు నాదెండ్ల వివరించినట్లు తెలుస్తున్నది. నాదెండ్లతో చర్చలు జరుగుతున్న సమయంలోనే కన్నా అనుచరులు, అభిమానులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో కన్నా.. తన రాజకీయ కార్యచరణ ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే భేటీ అనంతరం కన్నా.. జనసేనలో చేరికపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

కన్నాతో భేటీ అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఏపీని వైసీపీ, జగన్ విముక్త రాష్ట్రంగా చేయడానికి కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని ఆక్షేపించారు. రాష్ట్రానికి మంచి రోజులు రావల్సిన అవసరం ఉందని, అందుకోసం కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఏదైనా విశేషం ఉంటే తప్పకుండా త్వరలో అప్‌డేట్ చేస్తానని అన్నారు. ఇంకా కీలకనేతలు ఎవరైనా చేరుతున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు నాదెండ్ల సమాధానం దాటవేశారు.

కాగా, కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని విడిచిపెట్టి జనసేనలో చేరితే ఒరిగేది ఏముంటుందనే చర్చ కూడా జరుగుతున్నది. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్న సమయంలో కన్నా.. ఏ పార్టీలో ఉన్నా ఒకటే కదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీని వదిలి.. కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని జనసేనలో కన్నా చేరతారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఎప్పుడు.. ఎవరు.. ఎలా వ్యవహరిస్తారో అంచనా వేయడం కష్టం. మిత్రపక్షమైనా.. అక్కడ తనకు మంచి హోదా, గౌరవం దక్కుతుందనే ఆశ ఉంటే.. కన్నా పార్టీ మారినా మారొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  15 Dec 2022 2:37 AM GMT
Next Story