నిన్ను నమ్మం పవన్.. జనసేన ఆఫీస్ లకు తాళాలు
సీట్లు లేని చోట్ల జనసేన యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. పవన్ పై నమ్మకంతో తమ తమ వృత్తుల్ని, వ్యక్తిగత వ్యాపారాలను పక్కనపెట్టి చాలామంది జనసేనలో చేరారు. వారందరికీ ఇప్పుడు భ్రమలు తొలగిపోయాయి.
సోషల్ మీడియాలో 'నిన్ను నమ్మం బాబు' అనే హ్యాష్ ట్యాగ్ ఇటీవల బాగా పాపులర్ అయింది. తాజాగా ఈ స్లోగన్ ని పవన్ కి అన్వయించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ పార్టీ నేతలే పవన్ ని నమ్మలేమని చెప్పేస్తున్నారు. ఎన్నికల సమయంలో పవన్ అసలు స్వరూపం తెలిసిందని, పార్టీని నడిపే దమ్ము, ధైర్యం ఆయనకు లేవని మరోసారి రుజువైందని అంటున్నారు. అందుకే ఎక్కడికక్కడ జనసేన ఆఫీస్ లకు తాళాలు వేస్తున్నారు. ఆఫీస్ లకు అద్దె చెల్లించడం కూడా వృథా అని డిసైడ్ అయ్యారు. తాజాగా జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడంలేదు. ఇటీవల భవనం యజమాని టు-లెట్ బోర్డు పెట్టడంతో అసలు విషయం అర్థమైంది. అద్దె చెల్లించకపోవడంతో భవనం యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్టు సమాచారం.
ఎందుకీ నైరాశ్యం..?
పార్టీలో ఆశావహలు, ఇన్ చార్జ్ ల స్థానంలో ఉన్నవారు సొంత ఖర్చుతో ఆఫీస్ లు తెరుస్తుంటారు. ఫలితంగా భవిష్యత్తులో తమకు ఏదో ఒక మేలు జరుగుతుందనేది వారి ఆలోచన. కానీ జనసేనలో ఉంటే ఎప్పటికీ తమకు ఉపయోగం ఉండదని వారు డిసైడ్ అయ్యారు. టీడీపీతో పొత్తుకి ముందు ఏపీలో అత్యథిక స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని అనుకున్నారంతా. ఆమేరకు నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, ఆ పదవి వస్తుందని ఆశించినవారు భారీగా ఖర్చు పెట్టుకున్నారు. జనంలో తిరిగారు, కార్యకర్తలను పోషించారు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, అడ్వర్టైజ్ మెంట్లు.. ఓ రేంజ్ లో హడావిడి చేశారు. తీరా ఎన్నికల సమయానికి సీట్లలో కోతపడింది. ఫైనల్ గా 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లకు జనసేన పోటీ పడుతోంది. కొన్నిచోట్ల వైసీపీ, టీడీపీనుంచి వచ్చినవారికి టికెట్లు ఖరారయ్యాయి. ఈ దశలో అసలు సిసలు నేతలకు భవిష్యత్తుపై ఆశ లేకుండా పోయింది. కనీసం పార్టీ ఆఫీస్ మెయింటెన్ చేయడం కూడా వేస్ట్ అనుకుంటున్నారు. అందుకే జనసేన ఆఫీస్ లు ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి.
పవన్ ని నమ్మేదెలా..?
ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ని నమ్ముకుని రాజకీయాలు చేశామని, తీరా ఎన్నికల సమయానికి తమని మోసం చేశారని అంటున్నారు జనసేన నేతలు. ఆ మాట పైకి చెప్పలేనివారు, మౌనంగా బాధ భరిస్తున్నారు. అయితే మోసపోయిన అందరూ పార్టీకి దూరం జరిగారు, ఒకరిద్దరు టీడీపీ నేతలతో అడ్జస్ట్ అయిపోయి కాలం వెళ్లదీస్తున్నారు. అందుకే పార్టీ ఆఫీసులు మూతపడుతున్నాయి, సీట్లు లేని చోట్ల జనసేన యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. పవన్ పై నమ్మకంతో తమ తమ వృత్తుల్ని, వ్యక్తిగత వ్యాపారాలను పక్కనపెట్టి చాలామంది జనసేనలో చేరారు. వారందరికీ ఇప్పుడు భ్రమలు తొలగిపోయాయి. గతంలో కూడా చాలామంది ఇలాగే పార్టీని వదిలి వెళ్లారు. 2024 ఎన్నికల సమయంలో మరో బ్యాచ్ కి జ్ఞానోదయం అయింది.