జనసేన ఆధ్వర్యంలో యువశక్తి.. జనవరి 12న మొదలు
యువతను టార్గెట్ చేస్తూ జనసేన ఈ కార్యక్రమం చేపడుతోంది. యువతకు భరోసా ఇవ్వడమే యువశక్తి ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు నేతలు.

నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్
జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కొత్త ఏడాదిలో జనవరి 12న యువశక్తి అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, పవన్ కల్యాణ్ దీనికి ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
టార్గెట్ యూత్..
యువతను టార్గెట్ చేస్తూ జనసేన ఈ కార్యక్రమం చేపడుతోంది. దీన్ని ఒక యువజనోత్సవంలా నిర్వహిస్తామన్నారు నాదెండ్ల. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలుంటాయని, యువతకు భరోసా ఇవ్వడమే యువశక్తి ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు. త్వరలో ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్రమంతా చేపడతామన్నారు నాదెండ్ల మనోహర్.
వారాహిపై కంగారెందుకు..?
వారాహి వాహనాన్ని పరిచయం చేయగానే కొంతమంది భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు నాదెండ్ల. అంత కంగారెందుకంటూ సెటైర్లు పేల్చారు. తాము నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని, సచివాలయాలకు రంగులు వేసి హైకోర్టుతో చీవాట్లు తిన్నట్టు కాదని మాజీ మంత్రి పేర్ని నానికి చురకలంటించారు.
జగనన్న కాలనీలు అనే కాన్సెప్ట్ వైసీపీ నేతలకు మినహా ఇంకెవరికీ ఉపయోగపడలేదని చెప్పారు నాదెండ్ల మనోహర్. అది ఓ పెద్ద కుంభకోణం అని అన్నారు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్కచోట కూడా ఇల్లు కట్టివ్వలేదన్నారు. వెంటనే లబ్ధిదారులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. మూడు నెలల్లో ఏపీ ఆస్తులను తెలంగాణకు తాకట్టు పెట్టిన నేతలు, ఇప్పుడు రాష్ట్రం కలసి ఉంటే బాగుటుందని ప్రజలను అయోమయస్థితిలోకి నెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులను ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తోందని, అందుకే ఆత్మహత్యలు జరుగుతున్నాయని, తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అండగా ఉంటామని వివరించారు.
అది ఏపీఎస్ఆర్టీసీ కాదు, వైఎస్ఆర్టీసీ..
విజయవాడలో జరిగిన బీసీ సభకు ఆర్టీసీ బస్సుల్లో ప్రజల్ని తరలించారని, వాస్తవానికి వైసీపీ బీసీ సభ అట్టర్ ఫ్లాప్ అని అన్నారు నాదెండ్ల మనోహర్. జనాలను తరలించడానికి ఆర్టీసీ బస్సుల్ని ఎందుకు ఉపయోగించారని ప్రశ్నించారు. ఏపీఎస్ఆర్టీసీని వైసీపీ నేతలు వైఎస్ఆర్టీసీగా మార్చేశారని ఎద్దేవా చేశారు.