వారాహిని ఇప్పుడైనా బయటకు తీస్తారా..?
2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోందని, ఎన్నికల కార్యక్రమాలు, సభలు సజావుగా సాగేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్టు.. ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆమధ్య వారాహి ఎక్కి వీరంగం వేసిన పవన్ కల్యాణ్.. తర్వాత ఆ ఆలివ్ గ్రీన్ వాహనాన్ని ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియడం లేదు. లోకేష్ యువగళం కోసం వారాహికి బ్రేకులేశారు. ఆ తర్వాత చంద్రబాబు రాష్ట్ర పర్యటనలతో పూర్తిగా వాహనానికి కవర్ తొడిగి పక్కనపెట్టారు. తాజాగా పవన్ కల్యాణ్ జనంలోకి వస్తారని అంటున్నారు. సభలు, సమావేశాలకోసం జనసేనలో కొత్త కమిటీలను వేశారు. కనీసం ఇప్పుడైనా వారాహిని బయటకు తీస్తారా, టీడీపీ నీడలా కాకుండా, జనసేన అధినేతగా పవన్ జనంలోకి వస్తారా అనేది తేలాల్సి ఉంది.
జోనల్ కమిటీల నియామకం..
జనసేనలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో లేదు. ఉమ్మడి జిల్లాలకు పార్టీ అధ్యక్షులు ఉన్నారు కానీ, వారి మాట చెల్లడం అంతంతమాత్రమే. ఈ దశలో ఇప్పుడు సడన్ గా జోనల్ కమిటీలంటూ జనసేనలో హడావిడి మొదలైంది. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, గోదావరి, రాయలసీమ-1, 2 అంటూ ఆయనకు ఇష్టమైన రీతిలో ప్రాంతాలను విడగొట్టి జోనల్ టీమ్ లను ఏర్పాటు చేశారు పవన్. 2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోందని, ఎన్నికల కార్యక్రమాలు, సభలు సజావుగా సాగేందుకు జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిందని.. ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కార్యక్రమాలు, సభలు అని ప్రత్యేకంగా చెప్పారంటే పవన్ కల్యాణ్ మీటింగ్ లకు రెడీ అవుతున్నారనుకోవాలి. అంటే వారాహి బయటకొస్తుందనుకోవచ్చు.
జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు జోనల్ కమిటీలు pic.twitter.com/xc4giOYD7a
— JanaSena Party (@JanaSenaParty) January 20, 2024
జోనల్ కమిటీలలో కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులతోపాటు డాక్టర్స్ టీమ్, లీగల్ టీమ్ లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి పార్టీ పదవులపేరుతో చాలామందిని పవన్ సంతృప్తి పరచినట్టు తెలుస్తోంది. తీరా ఎన్నికల వేళ జనసేనకు చంద్రబాబు ఎన్ని సీట్లిస్తారనేది తేలాల్సి ఉంది. జనసైనికులనుంచి, పవన్ కి సలహాలిచ్చే హరిరామజోగయ్య వంటి వారినుంచి పెద్ద సంఖ్యలే వినపడుతున్నాయి. కానీ చంద్రబాబు అంత త్యాగం చేస్తారా అనేది అనుమానమే. ఒకవేళ ఆయన పెద్ద మనసు చూపకపోయినా, పవన్ సర్దుకుపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఏర్పాటు చేసిన జోనల్ కమిటీలతో రేపు పవన్ కల్యాణ్ మీటింగ్ ఆసక్తికరంగా మారింది.