Telugu Global
Andhra Pradesh

సీఎం జగన్ ఫొటోతో జనసేన ప్రెస్ మీట్

మీడియా స‌మావేశం ప్రారంభమైన కొంతసేపటి తర్వాత ప్రత్యేకంగా ఖాళీగా ఉంచిన కుర్చీలో సీఎం జగన్ ఫొటోను తీసుకువచ్చి పెట్టారు.

సీఎం జగన్ ఫొటోతో జనసేన ప్రెస్ మీట్
X

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఓ చైర్ ను ఖాళీగా ఉంచి అందులో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టి ప్రెస్ మీట్ కొనసాగించడం వైసీపీకి కౌంటర్ ఇవ్వడమేనని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

శనివారం భీమిలిలో ముఖ్యమంత్రి జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి దాని ముందర వైసీపీ నాయకులు బాక్సింగ్ బ్యాగ్ ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన వైసీపీ శ్రేణులు కొందరు పవన్ బొమ్మ ముందర పెట్టిన బాక్సింగ్ బ్యాగ్ తో బాక్సింగ్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే ఇవాళ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన జనసేన ప్రెస్ మీట్ లో ఓ ఖాళీ చైర్ పై సీఎం జగన్ ఫొటో ఉంచారు. ప్రెస్ మీట్ ప్రారంభం కాక ముందే జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఖాళీగా ఉన్న కుర్చీల ఫొటోలను పోస్ట్ చేశారు. అందులో ఒక చైర్ ను హైలైట్ చేశారు. ఇవాల్టి ప్రెస్ మీట్ లో నాదెండ్ల మనోహర్ తో పాటు మరో వ్యక్తి పాల్గొననున్నారు.. వారెవరో చెప్పుకోండి చూద్దాం.. అంటూ పోస్ట్ చేశారు. దీంతో అందరూ పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ కు వస్తారేమో అని భావించారు.

అయితే ప్రెస్ మీట్ కు పవన్ రాలేదు. మీడియా స‌మావేశం ప్రారంభమైన కొంతసేపటి తర్వాత ప్రత్యేకంగా ఖాళీగా ఉంచిన కుర్చీలో సీఎం జగన్ ఫొటోను తీసుకువచ్చి పెట్టారు. నాదెండ్ల మనోహర్ పక్కనే ఆ ఫొటోను ఉంచారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఏనాడు మీడియా ముఖం చూడరని, అందుకే తాము ముఖ్యమంత్రిని మీడియా ముందుకు తీసుకువచ్చామని చెప్పారు.

ప్రభుత్వకాలం పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టడం లేదని చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పుడు లెక్కలను వివరించేందుకు విజయవాడలో ప్రెస్ మీట్ పెడతామని.. దీనికి ముఖ్యమంత్రి జగన్ వచ్చేందుకు సిద్ధమా? అని నాదెండ్ల సవాల్ విసిరారు.

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో లెక్కలు తారుమారు చేసి ప్రజలను మోసగించిందన్నారు. ప్రజలు దీనిని గమనించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. కాగా జనసేన ప్రెస్ మీట్ లో సీఎం జగన్ ఫొటో పెట్టడం వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకోసమే అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

First Published:  29 Jan 2024 8:27 PM IST
Next Story