Telugu Global
Andhra Pradesh

పవన్ మార్క్‌.. స్కాన్ చెయ్, సమస్య చెప్పెయ్

జనసేన చేపట్టిన శాఖలకు సంబంధించి ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్కాన్ చేసి సలహాలు పంపండి అంటూ జనసేన పేర్కొంది.

పవన్ మార్క్‌.. స్కాన్ చెయ్, సమస్య చెప్పెయ్
X

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. వరుస రివ్యూలతో అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. జనతా దర్భార్, జనవాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలు వింటున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్. సాంకేతికత సాయంతో జనసేనకు కేటాయించిన శాఖలను సమర్థంగా నిర్వహించేందుకు జనం సలహాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ దగ్గర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి. అలాగే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దగ్గర పౌరసరఫరాలు, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు ఉన్నాయి.

జనసేన చేపట్టిన శాఖలకు సంబంధించి ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్కాన్ చేసి సలహాలు పంపండి అంటూ జనసేన పేర్కొంది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏపీ ప్రజలకు సూచించింది. ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదంటే లింక్ ద్వారా గూగుల్ ఫామ్ నింపాలని జనసేన సూచించింది. ఈ మేరకు క్యూఆర్ కోడ్, లింక్‌లను ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

ఈ గూగుల్ ఫామ్‌లో మన పేరు, మొబైల్ నంబరు నింపడంతో పాటు ఏ శాఖకు సంబంధించిన సలహాలు లేదా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ జిల్లా అనేది వివరాలు నింపి సబ్మిట్ కొట్టాలి. దీని ద్వారా ఆయా శాఖలను ఎలా సమర్థంగా నిర్వహించాలనే దానిపై ప్రజల నుంచి అభిప్రాయాలను జనసేన సేకరిస్తోంది. దీనిపై నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి ఆలోచన అని.. ఇందులో మరికొన్ని అంశాలను కూడా చేర్చాలంటూ కోరుతున్నారు.

First Published:  25 Jun 2024 1:46 PM IST
Next Story