ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన హ్యాండ్..?
ఉత్తరాంధ్ర నుంచి నేరుగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి మాధవ్ విషయంలో కూడా జనసేన ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతుంది.
బీజేపీతో ఉంటూనే టీడీపీ సహకరిస్తోంది జనసేన. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ జనసేన తీసుకున్న స్టాండ్ ఆసక్తిగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవ్ తనకు జనసేన మద్దతు ఉందని ప్రకటించారు. కానీ, జనసేన మాత్రం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తాము ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నది వెల్లడించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
జనసేన అభిమానులు, శ్రేణులు వైసీపీని ఓడించేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాలని మాత్రమే చెప్పింది. ఓట్లు చీలకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ చెబుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చే ఆలోచన ఉంటే ఎలాగో పొత్తులో ఉన్నారు కాబట్టి నేరుగా ఆ విషయం చెప్పి ఉండేవారు. అలా కాకుండా వైసీపీని ఓడించాలని పిలుపునివ్వడం ద్వారా పరోక్షంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైపునకు తమ శ్రేణులను జనసేన మళ్లిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది.
ఉత్తరాంధ్ర నుంచి నేరుగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి మాధవ్ విషయంలో కూడా జనసేన ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతుంది. బీజేపీకి ఓటేయాల్సిందిగా చెప్పడం ఇష్టం లేక.. అదే సమయంలో టీడీపీకి ఓటేయాల్సిందిగా బహిరంగంగా ప్రకటించే ధైర్యం లేకనే జనసేన ఇలా వైసీపీని ఓడించండి అంటూ తన శ్రేణులకు నర్మగర్భ సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంది.