జనసైనికులు హుషారెత్తేలా 'జంగ్ సైరన్'.. ట్విస్ట్ ఏంటంటే..?
ఈ పాట కోసం డ్యాన్స్ మాస్టర్ జానీ బాగా కష్టపడినట్టు అర్థమవుతోంది. అయితే ఆయన కష్టానికి ఫలితం మాత్రం దక్కలేదు.
ఏపీ ఎన్నికల సమరంలో కార్యకర్తలకు హుషారు తెప్పించేలా పాటలు రెడీ అవుతున్నాయి. 'జెండాలు జత కట్టడమే మీ అజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా' అంటూ.. ఆమధ్య వైసీపీ విడుదల చేసిన ఓ పాట దుమ్మురేపింది. ఇప్పుడు అదే ఫోర్స్ తో జనసేన కూడా ఓ పాట రెడీ చేసింది. 'భగ భగ మండిన భగత్ సింగ్ ర పవను' అంటూ జంగ్ సైరన్ పాటను జనసేన అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. ఈ పాటకు జానీ మాస్టర్ మంచి స్టెప్పులు కంపోజ్ చేశారు.
వివిధ సందర్బాల్లో పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లిన వీడియోలను తీసుకుని ఈ పాట ఎడిట్ చేశారు. జనసైనికులు పవన్ ని ఎలా చూడాలనుకుంటారో.. సరిగ్గా అలాంటి పదాలతోనే పాట సిద్ధమైంది. జనసైనికులకు ఈ పాట ఊపు తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలో సగం పవన్ కల్యాణ్ కనపడితే, మిగతా సగం జానీ మాస్టర్ హైలైట్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఇక పవన్ ని పొగిడే క్రమంలో సీఎం జగన్ ని దూషించే ఘాటు పదాలు కూడా ఈ పాటలో ఉన్నాయి. ఒకరకంగా ఇది జగన్ అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నమే అని చెప్పాలి.
ట్విస్ట్ ఏంటంటే..?
ఈ పాట కోసం డ్యాన్స్ మాస్టర్ జానీ బాగా కష్టపడినట్టు అర్థమవుతోంది. అయితే ఆయన కష్టానికి ఫలితం మాత్రం దక్కలేదు. నెల్లూరుకి చెందిన జానీ మాస్టర్ ఆమధ్య జనసేన టికెట్ కోసం విపరీతంగా ప్రయత్నించారు. నిరసనలు, ధర్నాల్లో పాల్గొన్నారు. జనసేన కండువా కప్పుకుని, ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని పెద్ద పెద్ద డైలాగులు పేల్చారు. సీన్ కట్ చేస్తే ఆయనకు టికెట్ లేదని తేలిపోయింది. కానీ అంతకు ముందే పాటకోసం కమిట్ అవ్వడంతో దాన్ని పూర్తి చేసి, ఇటీవల విడుదల చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనపడ్డంలేదు. పవన్ ని నమ్ముకుంటే ఏమవుతుందో చాలా త్వరగా అర్థం చేసుకుని తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయారు. పవన్ పాటతో ప్రచారంలో ఊపొచ్చింది కానీ, ఎన్నికల్లో ఓట్లు వస్తాయో రావో వేచి చూడాలి.