Telugu Global
Andhra Pradesh

జగన్‌ నెమలి ఈకల హారంపై జనసేన విమర్శలు

జగన్‌కు వేసిన హారం నెమళ్లను చంపేసి తీసుకొచ్చి ఈకలతో చేసినది కాకపోవచ్చు. ఆ విషయాన్ని గుర్తించకుండా జనసేన విమర్శలు చేస్తున్నట్టుగా ఉంది.

జగన్‌ నెమలి ఈకల హారంపై జనసేన విమర్శలు
X

తెనాలి పర్యటనలో సీఎం జగన్‌కు వైసీపీ నేతలు నెమలి ఈకల దండను వేయడంపై జనసేన పార్టీ విమర్శలు చేస్తోంది. ఎన్ని నెమళ్లను చంపితే మీ మెడలో హారం తయారైందో తెలుసా అంటూ సీఎంను ప్రశ్నించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం నెమలికి ఏ విధంగా హాని తలపెట్టినా నేరమే అని గుర్తు చేసింది.

1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టానికి 2001లో సవరణ చేసి నెమలి ఈకలను విక్రయించడాన్ని నిషేధించారు. అయితే ఈ చట్టంలోనూ ఒక లొసుగు ఉంది. నెమళ్లకు సహజంగా ఊడిపోయే ఈకలను మాత్రం సేకరించి విక్రయించవచ్చు. దాని వల్లనే చాలా మంది గిరిజనులు వీటి ఈకలను సేకరించి అమ్ముతుంటారు.

నెమలి ఈకలను సహజసిద్ధంగా సేకరించామంటూ అమెజాన్, ప్లిప్‌కాట్ ద్వారా ఆన్‌లైన్లోనూ విక్రయిస్తున్నారు. అలా కొనుగోలు చేసే సీఎంకు హారం తయారు చేయించి ఉండవచ్చు. హైదరాబాద్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన సమయంలో ప్రధాని నరేంద్రమోడీకి ఇలాంటి నెమలి ఈకల హారాన్నే మెడలో వేశారు. అప్పుడు జనసేన స్పందించలేదు.

జగన్‌కు వేసిన హారం నెమళ్లను చంపేసి తీసుకొచ్చి ఈకలతో చేసినది కాకపోవచ్చు. ఆ విషయాన్ని గుర్తించకుండా జనసేన విమర్శలు చేస్తున్నట్టుగా ఉంది. అయితే చట్టంలోని లొసుగును ఆసరాగా చేసుకుని.. కొందరు స్మగ్లర్లు బాగా డిమాండ్ ఉన్న ఈకల కోసం నెమళ్లను చంపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పెద్దపెద్ద హారాల కోసం నెమలి ఈకలను వాడుకుండా చర్యలు తీసుకుంటే మంచిదే.

First Published:  1 March 2023 1:50 PM IST
Next Story