జనసేన అసలు సీట్లు 11.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
లెక్కలన్నీ తేలేసరికి జనసేన నాయకులు నికరంగా పోటీ చేస్తున్న సీట్లు 11 మాత్రమేనని స్పష్టమైంది. గత ఎన్నికల పక్కా సమాచారంతో 11 సీట్ల లెక్కను తేల్చారు నెటిజన్లు.
టీడీపీ-జనసేన కూటమి కుదిరిన తర్వాత జనసేన నుంచి భారీ టార్గెట్ వినిపించింది. 175లో సగానికి సగం సీట్లయినా కావాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఇక అక్కడినుంచి బేరసారాలు మొదలయ్యాయి. 60, 50, 40 ఇలా కౌంట్ పడిపోతూ వచ్చింది. ఈలోగా పవన్ కల్యాణ్, చంద్రబాబుతో హాట్ డీల్ కుదుర్చుకుని ఏకంగా 24కి పడిపోయారు. తనను తాను సమర్థించుకునే క్రమంలో గాయత్రీ మంత్రంలో అక్షరాలు 24 అని, అశోక చక్రంలో ఆకులు 24 అని.. రకరకాల కథలు అల్లారు పవన్. జనసైనికుల్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఓ దశలో బ్లాక్ మెయిల్ కి కూడా దిగారు. అసలు మన స్టామినా ఎంత..? మన పార్టీ నిర్మాణం ఏంటి..? మనం అడిగే సీట్లెన్ని అంటూ రెచ్చిపోయారు. సలహాలిచ్చేవారిని కూడా చెడామడా తిట్టేశారు పవన్.
24 నుంచి 21
పోనీ 24కి అయినా ఫిక్స్ అయ్యారా అంటే అదీ లేదు. బీజేపీ కూటమి కలిశాక, జనసేనకు కోతపడింది. మూడు అసెంబ్లీ సీట్లతోపాటు తన అన్న నాగబాబు ఆశపడిన లోక్ సభ సీటు కూడా ఆ పార్టీకి త్యాగం చేయాల్సి వచ్చింది. పవన్ మాత్రం తన వ్యూహాన్ని సమర్థించుకున్నారు. జనసేనకు అంతకంటే ఎక్కువ అడిగే సీన్ లేదని, కనీసం 21 స్థానాల్లో అయినా నికరంగా అన్ని సీట్లు గెలుద్దామంటూ కార్యకర్తలకు ఉద్బోధ చేశారు.
21 కాదు 11 మాత్రమే..
తీరా ఇప్పుడు లెక్కలన్నీ తేలేసరికి జనసేన నాయకులు నికరంగా పోటీ చేస్తున్న సీట్లు 11 మాత్రమేనని స్పష్టమైంది. గత ఎన్నికల పక్కా సమాచారంతో 11 సీట్ల లెక్కను తేల్చారు నెటిజన్లు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలితోపాటు నెలిమర్ల, కాకినాడ రూరల్, నరసాపురం, తాడేపల్లిగూడెం, పోలవరం, యలమంచిలి, నిడదవోలు నియోజకవర్గాల్లో మాత్రమే అసలు సిసలు జనసేన నాయకులు పోటీ చేస్తున్నారు. పిఠాపురం పవన్, నిడదవోలు కందుల దుర్గేష్ మినహా.. మిగతా వారంతా 2019లో కూడా జనసేన టికెట్ పై ఆయా స్థానాల్లో బరిలో దిగినవారే. పవన్, కందుల దుర్గేష్ వేరే స్థానాల్లో పోటీ చేసి ఇప్పుడు నియోజకవర్గాలు మారారంతే. ఇక 21లో మిగిలిన 10 సీట్లు వలస నేతలకు వెళ్లిపోయాయి.
175 సీట్లలో 11 చోట్ల మాత్రమే జనసేన నేతలు పోటీ చేస్తున్నారంటే అసలు పవన్ కల్యాణ్ వ్యూహం ఏంటి..? నిజంగానే ప్యాకేజీ తీసుకుని సరిపెట్టుకున్నారా..? పిఠాపురంలో తాను గెలిస్తే చాలని డిసైడ్ అయ్యారా..? పార్టీ కాదు, తనకు ఎమ్మెల్యే పదవి మాత్రమే ముఖ్యమని అనుకున్నారా..? మొత్తమ్మీద పవన్ కి పోరాడే ధైర్యం లేదు, వేచి చూసే ఓపిక లేదు, ఓటమిని తట్టుకునే సత్తాలేదు, నమ్ముకున్న వారిని కాపాడే నైజం లేదు.. అని సీట్ల కేటాయింపుతో మరోసారి రుజువైంది.