చంద్రబాబు నీకిది ధర్మమేనా - పవన్‌కల్యాణ్
తెలుగుదేశం రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిందన్న పవన్‌కల్యాణ్.. రాజోలు, రాజానగరం నుంచి జనసేన పోటీలో ఉంటుందని స్పష్టంచేశారు.
జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో విబేధాలు బయటపడుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు పవన్. మండపేటలో తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా ప్రకటించడంపై జనసేనాని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంతకీ పవన్‌కల్యాణ్ ఏమన్నారంటే.. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. లోకేశ్ సీఎం పదవిపై మాట్లాడినా తాము పట్టించుకోలేదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మౌనంగా ఉన్నానని చెప్పారు. పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదన్నారు. తెలుగుదేశం-జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చన్నారు. ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తామన్నారు.
ఇక తెలుగుదేశం రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిందన్న పవన్‌కల్యాణ్.. రాజోలు, రాజానగరం నుంచి జనసేన పోటీలో ఉంటుందని స్పష్టంచేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసన్నారు పవన్‌కల్యాణ్. అయితే తెలుగుదేశం పార్టీ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. వీలైనన్ని తక్కువ సీట్లలో జనసేనను పోటీ చేయించి.. మెజార్టీ సీట్లలో తన అభ్యర్థులు పోటీ చేసేలా తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలుగుదేశం వైఖరిపై ఇప్పటికే జనసేన నేతలు, సానుభూతిపరులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.