Telugu Global
Andhra Pradesh

ఇప్పుడు కూడా వన్ మ్యాన్ షోనేనా?

ఎనిమిది రోజుల యాత్రలో ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురంలో తిరిగినా ఒక్క లోక‌ల్ నేతకు కూడా వారాహి మీద స్థానం క‌ల్పించ‌లేదు. లోకల్ లీడర్లకు ప్రాధాన్యతను కల్పించటం ద్వారా పార్టీని మరింతగా బలోపేతం చేయాలనే అధినేతలు అనుకుంటారు. కానీ పవన్ మాత్రం ఇతరులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు కూడా వన్ మ్యాన్ షోనేనా?
X

జనసేన పార్టీలో అధినేత పవన్ కల్యాణ్ తప్ప ఇంకో నేత కనబడరు. ఉండటానికి రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ హోదాలో నాదెండ్ల మనోహర్ ఉన్నా పెద్ద నాయుకుడని చెప్పుకునేందుకు లేదు. ఈ మధ్యనే ప్రధాన కార్యదర్శిగా సోదరుడు నాగబాబును నియమించినా పెద్దగా ఉపయోగం లేదు . ఇంతకాలం పార్టీలో ఇలాగే జరిగిపోయింది.

ఎనిమిది రోజుల క్రితం వారాహియాత్ర మొదలైన విషయం తెలిసిందే. ప్రత్తిపాడు నుండి అమలాపురం వరకు వారాహి యాత్రలో పవన్ తప్ప రెండో నేతే కనబడలేదు. వారాహిపై నిల‌బ‌డేందుకు పవన్ ఎవరికీ అవకాశం కూడా ఇవ్వలేదు. లోకల్ నేతలను వారాహిపై స్థానం క‌ల్పిస్తే వాళ్ళకు కూడా కాస్త గౌరవం, మర్యాద ఇచ్చినట్లుంటుందని పవన్‌కు ఎందుకు అనిపించటంలేదో అర్థంకావటంలేదు. మామూలుగా ఏ పార్టీ అధినేతైనా ఎక్కడైనా ప్రయాణిస్తున్నపుడు లోకల్ నేతలను తన పక్కనే నించోబెట్టుకుంటారు.

లోకల్ లీడర్లకు ప్రాధాన్యతను కల్పించటం ద్వారా పార్టీని మరింతగా బలోపేతం చేయాలనే అధినేతలు అనుకుంటారు. కానీ పవన్ మాత్రం ఇతరులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తనకు తప్ప ఇంకెవరికీ జనాల్లో ప్రాధాన్యత దక్కకూడదని, పాపులరిటీ రాకూడదని అనుకుంటున్నట్లున్నారు. అందుకనే పక్కన ఎవరినీ నించుబెట్టుకోవడం లేదు, పరిచయం కూడా చేయటంలేదు. ఎన్నికలు తొందరలో వచ్చేస్తుంటే కూడా లోకల్ నేతలకు ప్రాధాన్యత కల్పించకపోతే జనాల్లోకి వాళ్లు ఎలా వెళ్ల‌గ‌లుగుతారు?

ఎనిమిది రోజుల యాత్రలో ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురంలో తిరిగినా ఒక్కరంటే ఒక్కనేతను కూడా వారాహి మీద స్థానం క‌ల్పించ‌లేదు. మళ్ళీ ఎక్కడ పర్యటిస్తే అక్కడ వైసీపీని గెలవనివ్వనని, వైసీపీ అభ్యర్థులు ఎలా గెలుస్తారో చూస్తానంటు చాలెంజ్‌లు మాత్రం చేస్తున్నారు. వారాహి యాత్ర అయిపోయిన తర్వాత పవన్ ప్రసంగాల తాలూకు టెంపోను మెయిన్ టైన్ అవ్వాలంటే లోకల్ లీడర్లు యాక్టివ్‌గా తిరగకపోతే సాధ్యంకాదు. లోకల్ లీడర్లు పది మంది ఆఫీసులో కూర్చుని మాట్లాడుకుంటే ఏమవుతుంది? అందరు కలిసి జనాల్లోకి వెళ్ళినపుడే కదా జనసేనకు మద్దతుగా నిలబడేది లేనిది తెలిసేది. ఆ అవకాశం పవనే ఇవ్వటంలేదంతే.

First Published:  23 Jun 2023 11:49 AM IST
Next Story