జనసేన టార్గెట్ 100 అసెంబ్లీ స్థానాలు..! - పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్
ఇప్పటికే తమ పార్టీకి బలం పెరిగిందని తమ పార్టీ నేతల ద్వారా నిర్వహించిన సర్వేల ద్వారా అభిప్రాయపడుతున్న పవన్.. ఇంకా బలం పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో పార్టీని గ్రౌండ్ లెవల్‌లో బలోపేతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ అక్కడ ముందస్తు ఎన్నికలకు వెళ్లే చాన్స్ లేదని ధ్రువీకరించుకున్న పవన్.. పార్టీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో దీనిని తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించుకునే యత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పవన్ టార్గెట్ 100 అసెంబ్లీ స్థానాలని ఆ పార్టీ కేడర్ చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో వాటిని కైవసం చేసుకునే దిశగా పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే తమ పార్టీకి బలం పెరిగిందని తమ పార్టీ నేతల ద్వారా నిర్వహించిన సర్వేల ద్వారా అభిప్రాయపడుతున్న పవన్.. ఇంకా బలం పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ కమిటీల్లో మార్పులు, చేర్పులపై దృష్టిపెట్టారు. రాష్ట్ర స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ముందుగా రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల కమిటీలూ వేయనున్నట్టు తెలుస్తోంది. తదనంతరం జిల్లా, మండల అధ్యక్షుల నియామకాలు చేపట్టి, కమిటీలను నియమించనున్నట్టు సమాచారం.
వచ్చే ఐదు రోజుల్లో నియోజకవర్గాల స్థాయిలో పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించనున్నట్టు తెలిసింది. క్రియాశీలక సభ్యత్వాల చేర్పింపుపై కేడర్‌కు సూచనలిచ్చింది. మరోపక్క కౌలు రైతుల భరోసా కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేయనున్నట్టు సమాచారం. ఈ నెలలో చిత్తూరు జిల్లాలో ఈ పర్యటన ఉంటుందని తెలుస్తోంది.
ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్టీ బలోపేతం దిశగా పవన్ ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం. అందుకనుగుణంగా తెలంగాణలోనూ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు సినిమాలు కూడా మరోపక్క పూర్తిచేస్తుంటే.. పార్టీ నిర్వహణ, ఎన్నికల ఖర్చుకు కూడా ఇబ్బంది ఉండదనేది ఆయన ఆలోచన అని సమాచారం. మరి ఆయన ఆలోచనలు కార్యాచరణ సాధించడం ఏమేరకు సాధ్యమవుతుందనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.