Telugu Global
Andhra Pradesh

వాలంటీర్లు కావలెను.. పవన్ కల్యాణ్ పిలుపు

క్షేత్ర స్థాయిలో పార్టీకోసం పనిచేసేందుకు, ఐటీవింగ్ లో పనిచేసేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ అంటూ 9281041479 ని ఆ ప్రకటనలో జత చేశారు.

వాలంటీర్లు కావలెను.. పవన్ కల్యాణ్ పిలుపు
X

వారాహి వ్యవహారం అంతా సినిమా స్టైల్ లోనే కొనసాగుతోంది. ప్రచారానికి ముందు సినిమా దర్శకులు, నిర్మాతలతో వారాహి దగ్గర పవన్ ఫొటోషూట్ నిర్వహించారు. ఇప్పుడు కూడా వారాహి వస్తున్న సందర్భంగా వాలంటీర్లు కావలెను అంటూ జనసేన నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఏదో కొత్త సినిమాకి నటీనటులు కావలెను అన్న స్టైల్ లో వాలంటీర్లు కావాలంటూ పవన్ కల్యాణ్ చెయ్యెత్తి పిలుస్తున్నట్టుగా జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. క్షేత్ర స్థాయిలో పార్టీకోసం పనిచేసేందుకు, ఐటీవింగ్ లో పనిచేసేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ అంటూ 9281041479 ని ఆ ప్రకటనలో జత చేశారు.


పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఈరోజు నుంచి మొదలవుతుంది. యాత్ర పార్ట్-1లో 9 నియోజకవర్గాలను పవన్ కవర్ చేస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి వారాహి దూసుకెళ్తుంది. కత్తిపూడి సెంటర్‌లో తొలి సభ ఏర్పాటు చేశారు. వాహనంపైనుంచే పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. 10 రోజుల్లో 7 చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు.

వారాహి వాహనంలో ముందుకు కదులుతూ జనవాణిలో భాగంగా ప్రజలనుంచి అర్జీలు స్వీకరించే పవన్ కల్యాణ్ అక్కడక్కడ వివిధ వర్గాల ప్రజలతో నేరుగా సమావేశమవుతారు. బహిరంగ సభల్లో అధికార వైసీపీపై విమర్శలు ఎక్కుపెడతారు. షెడ్యూల్ అంతా పోలీసులకు ముందే ఇచ్చేయడంతో అనుమతులన్నీ పక్కాగా వచ్చేశాయి. పవన్ వారాహి వెనక భారీ కాన్వాయ్ ఉంటుంది. ప్రత్యేక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు.

First Published:  14 Jun 2023 10:29 AM IST
Next Story