వాలంటీర్లు కావలెను.. పవన్ కల్యాణ్ ప్రకటన
టీడీపీ కూడా 'కుటుంబ సాధికార సారథులు' అనే పేరుతో రిక్రూట్ మెంట్ మొదలు పెట్టింది. ఇప్పుడు కొత్తగా జనసేన కూడా వాలంటీర్లు కావాలంటోంది. గతంలో కూడా ఇలాంటి రిక్రూట్ మెంట్లు జరిగినా.. ఎన్నికల సీజన్లో ప్రతి గ్రామంలో జనసేన వాలంటీర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
నిన్న మొన్నటి దాకా వాలంటీర్లపై నిందలేసి, ఇప్పుడు వాలంటీర్లకోసం పవన్ కల్యాణ్ ప్రకటన ఏంటి అనుకుంటున్నారా..? అవును, నిజంగానే పవన్ కల్యాణ్ వాలంటీర్లు కావాలంటూ ఓ ప్రకటన ఇచ్చారు. జనసేన పార్టీకోసం పనిచేయాలనుకుంటున్న వారు ఫలానా నెంబర్ కి కాల్ చేయండి, లేదా వాట్సప్ లో మెసేజ్ పెట్టండి అని అధికారికంగా ఓ ప్రకటన ఇచ్చారు. మెయిల్ కూడా చేయొచ్చన్నారు. ఇంతకీ జనసేనకు వాలంటీర్లు ఎందుకు..?
జనసేన పార్టీ అధినేత జనసేనాని. మిగతా నాయకులు, కార్యకర్తలంతా జనసైనికులు. వీర మహిళలు, సోషల్ మీడియా సోల్జర్స్ కూడా ఉన్నారు. వీరికి అదనంగా ఇప్పుడీ వాలంటీర్లు ఎందుకు అనేది తేలాల్సి ఉంది. నాయకులైనా, కార్యకర్తలైనా, వాలంటీర్లైనా జనసైనికులే జనసేనకు అన్నీ. మళ్లీ కొత్తగా వాలంటీర్లు దేనికి, వారి విధులేంటి అనేదే అసలు ప్రశ్న.
Volunteers who are willing to work for Janasena Party,
— JanaSena Party (@JanaSenaParty) August 23, 2023
Call or WhatsApp : 9281041479
Mail : volunteer@janasenaparty.org pic.twitter.com/NUzbCFGIQT
వైసీపీని చూసి..
వైసీపీ వాలంటీర్ల విధానం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. పోనీ వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది కాబట్టి, వారికి పార్టీతో సంబంధం లేదు అనుకుంటే, కొత్తగా గృహసారధులు అనే కాన్సెప్ట్ కూడా తెరపైకి తెచ్చారు. పార్టీకోసం పనిచేసే కార్యకర్తలనుంచే కొంతమందిని ఎంపిక చేసి ఎన్నికల కోసం ప్రత్యేక సైన్యంగా తయారు చేస్తున్నారు. ఈ కాన్పెప్ట్ నే టీడీపీ, జనసేన కాపీ కొడుతున్నాయి. ఆల్రడీ టీడీపీ కూడా 'కుటుంబ సాధికార సారథులు' అనే పేరుతో రిక్రూట్ మెంట్ మొదలు పెట్టింది. ఇప్పుడు కొత్తగా జనసేన కూడా వాలంటీర్లు కావాలంటోంది. గతంలో కూడా ఇలాంటి రిక్రూట్ మెంట్లు జరిగినా.. ఎన్నికల సీజన్లో ప్రతి గ్రామంలో జనసేన వాలంటీర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వారికి కొన్ని కుటుంబాలు కేటాయించి, వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
పార్టీ కార్యకర్తలు అని చెప్పుకోవడం కంటే.. పార్టీకోసం ఫలానా పని చేస్తున్నాం, మా పోస్ట్ ఇది అని చెప్పుకోడం కాస్త గౌరవంగా ఉంటుంది. అందుకే పార్టీలన్నీ కొత్త కొత్త పేర్లతో కార్యకర్తల్ని ఇలా ప్రోత్సహిస్తున్నాయి. వైసీపీ గృహ సారథులయినా, టీడీపీ కుటుంబ సాధికార సారథులయినా, జనసేన వాలంటీర్లయినా.. అందరూ పార్టీకోసమే పనిచేస్తారు. ఎన్నికల సీజన్ కాబట్టి ఈ రిక్రూట్ మెంట్లకు ప్రాధాన్యత మరింత పెరిగింది.