Telugu Global
Andhra Pradesh

2రోజులపాటు మౌనవ్రతం ప్రకటించిన పవన్

జనసేన మాత్రం భిన్నంగా స్పందించడం విశేషం. దేశవిదేశాల నుంచి.. ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందంటూ పవన్ కల్యాణ్ సుదీర్ఘ ట్వీట్ వేశారు.

2రోజులపాటు మౌనవ్రతం ప్రకటించిన పవన్
X

పవన్ కల్యాణ్ సహా, జనసేన నేతలు రెండు రోజులు మౌనవ్రతం పాటించబోతున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. “రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సంపూర్ధ మద్దతు అందిస్తుంది.” అంటూ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.


విశాఖ గ్లోబల్ సమ్మిట్ పై ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. కంపెనీలను తరిమేసిన ఏపీలో, ఉద్యోగులకు నెల జీతం సకాలంలో చెల్లించలేని ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు రాజకీయ దురుద్దేశాలతోటే ఈ సమ్మిట్ పెట్టారంటున్నారు. అయితే జనసేన మాత్రం భిన్నంగాస్పందించడం విశేషం. దేశవిదేశాల నుంచి.. ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందంటూ పవన్ కల్యాణ్ సుదీర్ఘ ట్వీట్ వేశారు. శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత పెట్టుబడిదారుల్ని మెప్పిస్తారని భావిస్తున్నానన్నారు పవన్ కల్యాణ్. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి సూచనలు..

అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి కూడ పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు. ఈ సమ్మిట్ ని వైజాగ్ కి మాత్రమే పరిమితం చేయకుండా.. ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని, ఇతర ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి అవకాశాలను ఇన్వెస్టర్లకు వివరించాలని చెప్పారు.

కేటీఆర్ ట్వీట్ తో..

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ తర్వాత పవన్ కల్యాణ్ లో చురుకు పుట్టినట్టు తెలుస్తోంది. ''వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న మా సోదర‌ రాష్ట్రం APకి శుభాకాంక్షలు రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు గొప్పగా అభివృద్ధి చెంది, భారతదేశంలో అత్యుత్తమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను'' అని కేటీఆర్ నిన్న ట్వీట్ చేశారు. ఏపీ సమ్మిట్ విజయవంతం కావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరుకోవడం శుభపరిణామం అంటూ సోషల్ మీడియా హోరెత్తింది. దీంతో పవన్ కూడా అలర్ట్ అయ్యారు, వెంటనే ట్వీట్ వేశారు.

First Published:  3 March 2023 8:38 AM IST
Next Story