రోజా వర్సెస్ జనసేన.. నగరిలో గరం గరం
నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని అంటున్నవారు తన ఇంటికి వస్తే సమాధానం చెబుతానన్నారు మంత్రి రోజా. దీంతో జనసేన నాయకులు రోజా ఇంటికి బయలుదేరారు. అయితే మధ్యలో పోలీసులు వీరిని అడ్డుకున్నారు.
ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా విమర్శల డోస్ పెంచారు. సమీక్షలు, సమావేశాల తర్వాత పవన్ ప్రసంగం అయిన వెంటనే రోజా నుంచి కౌంటర్లు పడేవి. అయితే వీటిని జనసేన నేతలు కూడా అంతే దీటుగా తిప్పికొడుతున్నారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో రోజా నియోజకవర్గాన్ని జనసేన నేతలు నేరుగా టార్గెట్ చేశారు. తాజాగా రోజా ఇంటి వద్దకు వెళ్తున్న జనసేన నేతల్ని స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది.
సోషల్ మీడియా వేదికగా సవాళ్లు..
ఇటీవల మంత్రి రోజా, జనసేన నాయకుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఓ రేంజ్ లో కొనసాగుతున్నాయి. రోజాకు వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ టికెట్ ఇవ్వరని జనసేన నాయకులు కామెంట్ చేస్తున్నారు. అసలు నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, ఒకవేళ జరిగిందని అనుకుంటే రోజా సమాధానం చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ ని స్వీకరిస్తున్నానని చెప్పిన రోజా.. అభివృద్ధి జరగలేదని అంటున్నవారు తన ఇంటికి వస్తే సమాధానం చెబుతానన్నారు. దీంతో జనసేన నాయకులు రోజా ఇంటికి బయలుదేరారు. అయితే మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. తమని రోజానే పిలిచారని, అభివృద్ధి గురించి వివరిస్తానన్నారని చెప్పినా పోలీసులు వినలేదు. ఇంటికి పిలిచి, ఇప్పుడిలా పోలీసులతో అరెస్ట్ చేయించడమేంటని ప్రశ్నిస్తున్నారు జనసేన నాయకులు.
నగరిలో రోజా శకం ముగిసిందని అంటున్నారు జనసేన నాయకులు. జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా లేదా అంటూ రోజా ప్రశ్నిస్తున్నారని, అసలు రోజాకి నగరిలో మళ్లీ సీటి ఇస్తారా లేదా అనేది ఆమె తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. నగరిలో మళ్ళీ రోజా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. అయితే రోజా కూడా వీరికి ఘాటుగా రిప్లయ్ ఇస్తున్నారు జెండా విలువలు లేని వ్యక్తి వెనక జనసేన కార్యకర్తలు ఉన్నారని మండిపడ్డారు. మొత్తమ్మీద రోజా కేంద్రంగా నగరిలో మాటల తూటాలు పేలుతున్నాయి.